స్పెషల్ డెస్క్- పెళ్లి మంటపంలో వివాహం జరుగుతుంటుంది.. బాజా భజంత్రీలు మోగుతుంటాయి. ఆహుతులంతా ఉత్సాహంగా పెళ్లి తంతు చూస్తుంటారు. పంతులుగారు పెళ్లి మంత్రాలు చదువుతుంటాడు.. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళిబొట్టు కట్టే సమయంలో ఆపండీ.. అని ఓ ఆరుపు వినిపిస్తుంది.. అంతే పెళ్లి ఆగిపోతుంది. ఇలాంటి సీన్స్ మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ ఇలా నిజజీవితంలోను అక్కడక్కడ జరుగతుంటాయి. కానీ చాలా అరుదని చెప్పవచ్చు. ఐతే ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాగే ఓ పెళ్లి చివరి ఆగిపోయింది. యూపీలోని మహోబా జిల్లాలో ఓ వివాహం జరుగుతోంది. హఠాత్తుగా వధువు, వరున్ని రెండో ఎక్కం చెప్పమని అడిగింది. వరుడు ఎక్కం చెప్పలేక పోయాడు. దీంతో ఈ పెళ్లి చేసుకోనని పెళ్లి కూతురు చెప్పేసరికి అంతా అవాక్కయ్యారు. అసలేం జరిగిందంటే.. పెళ్లి సంబందం మాట్లాడే సమయం పెళ్లి కొడుకు బాగా చదువుకున్నాడని, త్వరలోనే మంచి ఉద్యోగం వస్తుందని చెప్పారట అబ్బాయి తరపువాళ్లు.
అమ్మాయి కూడా డిగ్రీ వరకు చదివింది. దీంతో బాగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి జరిపించేందుకు నిర్ణయించారు. ఐతే తీరా పెళ్లి మండపంలో అబ్బాయి ప్రవర్తన, మాట తీరులో తేడా గమనించిందట పెళ్లి కూతురు. అనుమానం వచ్చి రెండో ఎక్కం చదవమని అడిగింది వధువు. దీంతో ఈ హఠాత్పరిణామానికి పెళ్లి కొడుకు కళ్లు తేలేయగా, అతిధులు అవాక్కయ్యారట. అసలు స్కూలు మొహమే చూడని పెళ్లి కొడుకు రెండో ఎక్కడం చెప్పలేకపోయాడు. ఇంకేముంది చదువురాని మొద్దును పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది వధువు. పెళ్లికి వచ్చిన వారంతా ఆమెకు నచ్చజెప్పాలని చూసినా పెళ్లి కూతురు మాత్రం ససేమిరా అంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అంతటితో వదిలిపెట్టకుండా.. పెళ్లి ఏర్పాట్లకు అయిన ఖర్చును ఇప్పించాలని వరుడి కుటుంబంపై పోలీస్ లకు పిర్యాదు చేసింది వధువు. ఈ కాలం అమ్మాయిలు ఆ మాత్రం తెలివిగా, తెగువగా ఉండాలి మరి అని పెళ్లికి వచ్చినవారు కామెంట్స్ చేశారు.