తనని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టే అంశాలలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఒకటని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ నమ్మకం. ప్రజలకి కావాల్సిన అన్నీ పనులను వాలంటీర్స్ ఇంటికే వెళ్లి పూర్తి చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లల్లో వాలంటీర్స్ కుటుంబ సభ్యుల్లా కలసి పోతున్నారు. ప్రభుత్వం ప్రజలకి ఇంతకన్నా దగ్గరగా ఎలా ఉంటుంది? ఇదే వై.ఎస్. జగన్ నమ్మకం. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.
చాలా మంది వాలంటీర్స్ కష్టపడి పని చేస్తున్నా.., కొంతమంది మాత్రం చేతి వాటం చూపిస్తున్నారు. ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాలకు.. మధ్యలో ప్రజల నుండి లంచం డిమాండ్ చేస్తూ వాలంటీర్స్ గుడి బండగా మారుతున్నారు. తాజాగా.. అనంతపురం జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా ధర్మవరంలో మహిళా వార్డు వాలంటీర్ లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా బుక్ అయిపోయింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేతన్న నేస్తం లబ్ది కావాలంటే చేయి తడపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు వాలంటీర్స్.
అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ పరిధిలో సువర్ణ అనే మహిళా వాలంటీర్ పని చేస్తోంది. వెంకటేష్ అనే లబ్ధిదారుడుకి నేతన్న నేస్తం పథకం అందేలా చేయడానికి ఈమె రూ.2వేలు డిమాండ్ చేసింది. లబ్ధిదారుడు 1500 ఇస్తాను.. ఒప్పుకోమ్మా అని వేడుకుంటున్నా ఆ వాలంటీర్ ఒప్పుకోలేదు. ఈ సంభాషణ కూడా వీడియోలో రికార్డయింది. దీంతో.., ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.