వర్షంలోను రోడ్లు ఊడుస్తున్న మహిళా స్వీపర్
స్వీపర్ ను కొనియాడిన ఆనంద్ మహీంద్ర
స్వీపర్ వీడియోను షేర్ చేసిన అనంద్
ముంబయి- ఆనంద్ మహీంద్రా.. భారత్ లో ప్రముఖ వ్యాపారవేత్త. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మెన్. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఎవరన్నా మంచి పని చేస్తే మెచ్చుకోవడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఆయనకు బాగా ఆలవాటు. ఈ క్రమంలోనే మహీంద్రా కంపెనీ చైర్మెన్ గా కంటే సోషల్ మీడియా ద్వారనే ఆయనను సామాన్యులు సైతం గుర్తుపడుతున్నారు. ఇక ఇప్పుడు తుఫాను సందర్బంగా కూడా ఆనంద్ మహీంద్రా స్పందించారు. తౌక్తే తుపాను ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. తుఫానుకు తోడు కరోనా భయంతో ముంబయి ప్రజలు ఎవ్వరు బయటకు రావడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బృహన్ ముంబయి మునిసిపాలిటీకి చెందిన ఓ మహిళా వర్కర్ మాత్రం ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది.
భారీ వర్షం కురుస్తున్నాఈ మహిళా వర్కర్ మాత్రం రోడ్లు ఊడ్చడంలో నిమగ్నమైపోయింది. కనీసం వాన నుంచి రక్షించుకునేందుకు రెయిన్ కోట్ కూడా లేకుండా, తలకు మాత్రం ఓ ప్లాస్టిక్ కవరు చుట్టుకుని ఆమె రోడ్డు ఊడుస్తోంది. పని విషయంలో ఆమె సిన్సియారిటీ చూసి చాలా మంది ప్రశంసించారు. ఇందుకు సంబందించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఆనంద్ మహీంద్రా కంటిలో పడింది. ఈ వీడియోను తిరిగి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఈ రోజుకు ఇంతకు మించిన మోటివేషన్ లేదని కామెంట్ చేశారు. బృహన్ ముంబయి కార్పోరేషన్ వారికి రెయిన్ కోట్‌లు అందివ్వాలని ఆయన సూచించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నిబద్ధతో పనిచేసే వారు కరోనా వారియర్ల కంటే తక్కువేమి కాదని నెటిజన్స్ పొగుడుతున్నారు. నిజంగా ఆ మహిళకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.