పోలీసులు చట్టాన్ని కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరిస్తుంటారు.. దాంతో పోలీసులు అంటే ఎవరైనా భయపడుతుంటారు. పోలీసుల్లో కూడా గొప్ప మనసు చాటుకొని ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వారు ఉన్నారు.
సాధారణంగా పోలీసులు ఎంతో కఠినమైన మనసు కలిగి ఉంటారని.. చట్టాన్ని పరిరక్షించడంలో భాగంగా సొంత కుటుంబ సభ్యులైనా సరే తప్పు చేస్తే కఠినంగా శిక్షిస్తుంటారు. పోలీసులు తప్పనిసరి పరిస్థితిలో చట్టాన్ని గౌరవించి అలా చేస్తుంటారని అంటారు. పోలీసుల్లో గొప్పమనసు చాటుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఆపద సమయంలో ఉన్నవారిని కొన్నిసార్లు ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. తాజాగా రైల్వే స్టేషన్ స్వీపర్ గా చేస్తున్న ఓ మహిళకు ప్రసవం చేసి తమ మంచి మనసు చాటుకున్నారు రైల్వే పోలీసులు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమం. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రైల్వేలో పోలీస్ ఉద్యోగం నిర్వహిస్తున్న పోలీసులు ఓ మహిళకు ప్రసవం చేసి తల్లీబిడ్డలను రక్షించారు. రాజస్థాన్ లోని అజ్ మేర్ రైల్వే స్టేషన్ లో పూజా అనే మహిళ స్వీపర్ గా పనిచేస్తుంది. పూజా నిండు గర్భిణి.. గురువారం కూడా పనికి వచ్చింది. ఆ మహిళకు పనిచేస్తే తప్ప పూటగడవని పరిస్థితి.. ఈ కారణంతోనే నిండు గర్భంతో ఉన్నప్పటికీ స్టేషన్ కి వచ్చి పనిచేసుకుంటుంది. అంతలోనే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి.. సాధారణంగా మహిళకు పురిటినొప్పులు.. బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మతో సమానం. ఆ మహిళ బాధ విన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ప్రేమ్ రావు కి సమాచారం అందించారు.
కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ అందించిన సమాచారంతో ప్రేమ్ రావు వెంటనే మహిళా కానిస్టేబుల్స్ అయిన సావిత్రి ఫగేడియా, హంస కుమారి, లక్ష్మీ వర్మలను పంపించారు. అప్పటికే పూజ తీవ్రమైన ఇబ్బంది పడుతుంది.. ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లే సమయం కూడా లేదు.. దీంతో వారే ప్రసవం చేయాలని నిర్ణయించుకున్నారు. దేవుడిపై భారం వేసి కానిస్టేబుల్స్ అక్కడే ఓ దుప్పటి చుట్టూ అడ్డంగా పెట్టి.. పూజకు ధైర్యం చెబుతూ ప్రసవం చేశారు. అదృష్టం కొద్ది తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ప్రసవం తర్వాత పూజా, పురిటి బిడ్డను స్థానిక సాటిలైట్ ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డలకు ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. కష్టకాలంలో ఆదుకొని తనకు పునర్జన్మనిచ్చి కానిస్టేబుల్స్ కి పూజ ధన్యవాదాలు తెలిపింది. కానిస్టేబుల్స్ చేసి గొప్పపనికి ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.