ఇంటర్నేషనల్ డెస్క్- పార్క్ చేసిన కారు ఎక్కడో ఉంటుంది.. జస్ట్ మనం రిమోట్ నొక్కగానే ఆ కారు నేరుగా మన ముందు వచ్చి ఆగుతుంది. ఇక కారు స్పీడ్ గా వెళ్తుండగా అడ్డంగా నది వస్తుంది. ఏ మాత్రం తడబడకుండా కారు నదిలోకి వెళ్లి పడవలా మారిపోతుంది. ఎంటీ ఇవన్నీ ఏ జేమ్స్ బాండ్ సినిమాలోనో చూశామని అనుకుంటున్నారా. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయి.
టెస్లా కార్లలో ఆటో పైలెట్ టెక్నాలజీ ఎందరినో ఆకట్టకుంటోంది. తాజాగా ఎగిరే కార్ల ప్రయోగం కూడా సక్సెస్ అయ్యింది. చాలా కాలంగా ఎగిరే కార్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. దాదాపు పదేళ్ల క్రితమే ఎయిర్ కార్ అనే సంస్థ ఎగిరే కార్లపై ప్రయోగాలను మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఎగిరే కారును తయారు చేసిన ఈ సంస్థ జూన్ 28న స్లొవాకియాలో విమానాశ్రయాంలో ఈ కారును విజయవంతంగా నడిపారు.
నిత్ర ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరిన ఎయిర్‌కార్ సుమారు 32 నిమిషాలు గాల్లో ఎగిరి బ్రతిస్లావా ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండైంది. క్లెయిన్ విజన్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో స్టెఫాన్ క్లెయిన్ ఈ కారును స్వయంగా నడిపారు. బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ కథనం మేరకు బీఎండబ్ల్యూ ఇంజిన్‌తో తయారు చేసిన ఈ ఎయిర్‌కారు సాధారణ పెట్రోల్ కారు తరహాలోనే నడుస్తుంది. ఇది విమానం లాగే టేకాఫ్, ల్యాండ్ అవుతుంది.
సముద్ర మట్టానికి 8,200 అడుగుల ఎత్తులో వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలదు. ఇక కారు నుంచి విమానంగా మారేందుకు 15 సెకన్లు సమయం పడుతుంది. ఈ ఎయిర్ కారు అందుబాటులోకి రావడానికి మరో యేదాడి సమయం పట్టే అవకాశం ఉంది. ఎయిర్‌కార్ గాల్లో ఎగురుతూ సేఫ్‌గా ల్యాండైన వీడియోను ఆ సంస్థ యూట్యూబ్‌లో పోస్టు చేసింది.