హైదరాబాద్- వర్ధమాన సినీ నటి షాలు చౌరాసియా పై హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో దాడి ఘటన సంచలనం రేపింది. ఎప్పుడూ రద్దీగా ఉండే, అందులోను వీఐపీలు ఎక్కువగా వచ్చే కేబీఆర్ పార్క్ లో ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. నటి చౌరాసియాపై దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా నిందితుడుని పట్టుకోకపోవడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో తనపై జరిగిన దాడికి సంబంధించి చౌరాసియా పలు విషయాలను చెప్పారు. గత మూడేళ్లుగా రోజూ సాయంత్రం కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పింది ఆమె. ఈనెల 14న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లి, తిరిగి 8 గంటల సమయంలో కారు వద్దకు వస్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడని చెప్పుకొచ్చింది.
తన రెండు చేతులు వెనక్కి పట్టుకొని డబ్బులివ్వాల్సిందిగా డిమాండ్ చేశాడట. తాను గట్టిగా అరిస్తే ముఖం, మూతిపై పిడిగుద్దులు గుడ్డాడని చెప్పింది. తన వద్ద డబ్బులు లేవని, కావాలంటే10 వేలు ఫోన్ పే చేస్తానని అతని ఫోన్ నెంబర్ అడిగానని గుర్తు చేసుకుంది. ఐతే ఆ దుండగుడు తన నెంబర్ చెప్పేందుకు వెనుకాడాడని చెప్పింది. అంతలో తాను పోలీస్ కంట్రోల్ రూం 100కు డయల్ చేసే ప్రయత్నం చేస్తుండగా గమనించిన తన ఫోన్ లాక్కున్నాడని చెప్పుకొచ్చింది.
పక్కనే ఉన్న బండరాయిపై నా తలను గట్టిగా బాదడంతో తాను స్పృహ కొల్పోయానని, ఆ తరువాత తనను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడని భయపడుతూనే చెప్పింది నటి చౌరాసియా. అతడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా తనకు స్పృహవచ్చి అతడిని గట్టిగా తోసేశానని చెప్పింది. దీంతో ఆ దుండగుడు తనపై బండరాయి విసరగా వెంటనే పక్కకు తప్పుకొన్నానని అంది.
తనను అక్కడ పార్కులోనే చంపేసి కాల్చేస్తానని బెదిరించడంతో ఎలాగోలా తప్పించుకుని కేబీఆర్ పార్క్ ఫెన్సింగ్ ఎక్కి ప్రాణాలతో బయటపడ్డానని గుర్తు చేసుకుంది. హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవగా పక్కనే ఉన్న కాఫీ షాపు సిబ్బంది వచ్చి సాయం చేశారని చౌరాసియా చెప్పుకొచ్చింది. తనకు శత్రువులెవరూ లేరని, ఎవరిపైనా అనుమానం లేదని చెప్పింది.