గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః అంటూ గురువుకు ఎంతో ఉన్నతమైన స్థానం కల్పించబడింది. తల్లిదండ్రుల తర్వాత పిల్లల బాధ్యత గురువుపైనే ఉంటుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దే గొప్ప బాధ్యత గురువుపైనే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి జీవితంలో మంచి స్థానం పొందేవరకు ప్రతి దశలోనూ ఉపాధ్యాయుడి ముద్ర ఎంతైనా ఉంటుంది. సాధారణంగా ఎవరైనా ఉద్యోగం చేస్తే కాస్త విరామం దొరికితే బాగుంటుందని భావిస్తుంటారు. ఉద్యోగరిత్యా వత్తిడికి లోనైతే సెలవు తీసుకుంటారు. కానీ ఓ ఉపాధ్యాయుడు మాత్రం 12 ఏళ్లలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా విద్యార్థులకు విద్యను బోధిస్తు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వ పాఠశాల అంటే ఉపాధ్యాయుడు సరిగా హాజరు కారు.. ఒకవేళ పాఠశాలకు వెళ్లినా మొక్కుబడిగా ఉంటూ విద్యను బోధిస్తుంటారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అందుకే పేదరికంలో ఉన్నవారు సైతం తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపించాలని చూస్తుంటారు. అయితే అరియలూరు జిల్లా కారైక్కురిచ్చి అనే ఊరిలో గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఒకటి ఉంది. ఈ స్కూల్ లో కలైయరసన్ అనే మాస్టర్ కొంతకాలంగా పిల్లలకు విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు. గతంలో పలు పాఠశాలల్లో పనిచేసిన కలైయరసన్ మాస్టారు ప్రస్తుతం కారైక్కురిచ్చి అనే గ్రామంలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. కలైయరసన్ మాస్టారు 2014 నుంచి ఒక్క సెలవు కూడా తీసుకోకుండా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు పన్నెండు సంవత్సరాలుగా పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిస్తున్నారు.
కలైయరసన్ గురించి తెలిసిన ఉద్యోగులు, చుట్టు పక్కల గ్రామ ప్రజలు ఆయనను ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నారు.. ఇలాంటి ఉపాధ్యాయుడు దేశానికి ఆదర్శం అని కొనియాడుతున్నారు. ఈ విషయం గురించి కలైయరసన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యను బోధించి వారిని సమాజంలో ఉన్నత స్థానంలో చూడాలనేది నా ఆకాంక్ష.. అందు కోసం ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాలకు వచ్చి వారికి పాఠాలతో పాటు మంచి విషయాలు బోధించేవాడినని అన్నారు. సెలవు తీసుకోవాల్సిన అవసరం నాకు రాలేదని.. పిల్లలకు పాఠాలు బోధిస్తుంటే నాకు సమయం తెలియదని అన్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. కలైయరసన్ మాస్టార్ ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారని.. అంతేకాదు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు కూడా ఆయన విద్యార్థులకు అందిస్తారని అన్నారు. తమ స్కూల్ లో ఉత్తమ విద్య అందిస్తున్న కారణంతో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.