ఛత్తీస్ ఘడ్- ఈ ప్రపంచంలో జంతువులను, పక్షులకు మనిషితో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. కొన్ని జంతువులు మనుషులకు మచ్చిక అవుతుంటాయి. కానీ ఒక్కోసారి జంతువులు మనుషులకంటే కూడా మానవత్వం చూపిస్తుంటాయి. మనిషి కంటే జంతువులే నయం అనిపించేలా ప్రవర్తిస్తుంటాయి జంతువులు.
ఇదిగో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన ఘటనే ఇందుకు ఉహాదరణగా చెప్పుకోవచ్చు. మనసు, మానవత్వం లేని ఓ తల్లి తన బిడ్డను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళితే, వీధి కుక్క తల్లిగా మారింది. తన బిడ్డలతో పాటే రాత్రంతా ఆ పసిపాపకు కాపలా కాసింది. ఎలాంటి హానీ కలగకుండా ఆ పసికందును కాపాడింది. ఇప్పుడీ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ముంగెలీ జిల్లాలో సారిస్తాల్ ఉరిలో వీధి కుక్క, తన నాలుగు పిల్లలతో పాటు ఓ నవజాత శిశువు ఉన్నట్లు గ్రామస్థులు గమనించారు. రాత్రంతా ఆ పసిబిడ్డకు ఆ శునకాలే రక్షణగా ఉన్నాయని తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్లు గుర్తించారు. ఐతే అప్పుడే పుట్టిన ఆ పాపను వదిలేసి వెళ్లిన వారి ఎవరనేది మాత్రం తెలియలేదు.
తల్లి కుక్క, కుక్క పిల్లలతో పాటు పసి బిడ్డను గుర్తించిన స్థానికులు పాపను ఆసుపత్రికి తరలించారు. నవ జాత శిశువును పరీక్షించిన వైద్యులు పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పారు. దీంతో గ్రామస్థులు లోర్మీ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చింతారామ్, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారుల సంక్షేమ కమిటీ సభ్యులు ఆ పాపను స్వాదీనం చేసుకుని చిన్నారికి ఆకాంక్ష అని పేరు పెట్టారు. నిజంగా నోరు లేని ఆ మూగ శునకం తన అమ్మ తనాన్ని చాటుకుంది కదా.