అప్పుడే పుట్టిన పిల్లలు ఏడిస్తే ఆకలికి ఏడుస్తున్నారనో లేక కడుపు నొప్పి వచ్చి ఏడుస్తున్నారనో అనుకుంటారు. కానీ అసలు ఎందుకు ఏడుస్తారో అనేది ఖచ్చితంగా కనిపెట్టలేరు. అయితే పిల్లల ఏడుపులో శబ్దాలను బట్టి తల్లులు వారి సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో చూసేయండి.
అప్పుడే పుట్టిన పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు, విపరీతంగా పేచీ పెడుతుంటారు. నోరు లేదు కాబట్టి వారికి ఏం కావాలో, ఏమైందో అనేది చెప్పలేరు. ఏడుపుతోనే తమ సమస్యను వ్యక్తపరుస్తారు. అలా ఏడ్చినప్పుడు ఆకలి వేస్తుందనో లేక ఏ కడుపు నొప్పో వస్తుందనో అనుకుంటారు. కొంతమంది తల్లులు తమ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో ఖచ్చితంగా గుర్తించగల శక్తి ఉంటుంది. దానికి తగ్గట్టు పిల్లల ఏడుపును కంట్రోల్ చేస్తారు. కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుంటే వారికి టానిక్ ఇచ్చి నిద్రపుచ్చుతారు. ఆకలిగా ఉండి ఏడిస్తే గనుక పాలిచ్చి నిద్రపుచ్చుతారు. అయితే తమ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అనేది కొంతమంది తల్లులు గుర్తుపట్టలేరు.
ఆకలికి, కడుపు నొప్పి కారణంగా ఏడుస్తున్నారని అనుకుంటారు గానీ ఖచ్చితంగా ఎందుకు ఏడుస్తున్నారు, పిల్లల ఏడుపు ఆపాలంటే ఏమి చేయాలి అన్నది తెలియదు. మరి మీ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో? మీ పిల్లల ఏడుపు వెనుక ఉన్న అసలైన అర్థం ఏమిటో తెలుసుకోండి. ఏడుపులో 5 రకాల శబ్దాలు ఉన్నాయి. నెహ్, ఆ, హెహ్, ఎయిర్, ఎహ్.. ఈ శబ్దాల అర్థాలు తెలిస్తే మీ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అనేది తెలుస్తుంది. ఈ ఐదు రకాల శబ్దాలు ఐదు సమస్యలను తెలియజేస్తాయి పిల్లలు ఈ 5 సమస్యలతో బాధపడినప్పుడే వారు 5 రకాల శబ్దాలతో ఏడుస్తారు. ఆ శబ్దాలను క్యాచ్ చేస్తే మీ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో ఖచ్చితంగా గుర్తించి కంట్రోల్ చేయవచ్చు.
బేబీ నెహ్ అనే శబ్దంతో ఏడుస్తూ ఉంటే గనుక ఆకలితో ఉన్నట్టు అర్థం. సాధారణంగా ఈ శబ్దం.. బేబీ తన నాలుకతో నోరు యొక్క పై భాగాన్ని టచ్ చేసినప్పుడు లేదా చప్పరిస్తున్నప్పుడు వస్తుంది. ఈ శబ్దంతో ఏడుస్తుంటే గనుక బేబీకి పాలివ్వాలి. ఆ అనే శబ్దంతో ఏడుస్తుంటే గనుక నిద్రమబ్బుతో ఉన్నారని అర్థం. రాత్రుళ్ళు ఏడుస్తుంటే గనుక బేబీ అలసిపోయినట్టు అర్థం. సాధారణంగా ఈ శబ్దం ఆవలింతలు వచ్చినప్పుడు, కళ్ళను రుద్దుకోవడం వల్ల వస్తుంది. పిల్లలను సౌకర్యవంతమైన పొజిషన్ లో నిద్రపుచ్చాలి. హెహ్ అనే శబ్దంతో ఏడుస్తుంటే గనుక ఆ బేబీ అసౌకర్యంగా ఉన్నట్టు. డైపర్ తడిగా ఉండడం లేదా చల్లగా,దురదగా ఉండడం వల్ల అసౌకర్యంగా ఫీలవుతారు. అప్పుడే పుట్టిన పిల్లలు అసౌకర్యం వల్లే ఎక్కువగా ఏడుస్తుంటారు. ఈ హెహ్ శబ్దం వినడానికి నెహ్ శబ్దంలానే ఉంటుంది. వినడానికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. గది ఉష్ణోగ్రత కూడా బేబీ ఏడుపుకి కారణమవుతుంది. కాబట్టి బేబీకి సౌకర్యం కలిగించాలి.
ఎయిర్ అనే శబ్దంతో ఏడిస్తే గనుక కడుపు దిగువన గ్యాస్ సమస్యతో బాధపడుతున్నట్టు. ఈ సమస్య వచ్చినప్పుడు బేబీ తన మోకాళ్ళను ఛాతీ మీదకు లాక్కుంటుంది, అలానే తన్నుతుంటుంది. బేబీకి పాలు ఇచ్చిన తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడకుండా బర్ప్ చేయాలి. అంటే నోటి ద్వారా గాలిని బయటకు వెళ్లేలా చేయాలి. బేబీని పట్టుకుని వీపు కండరాలను సున్నితంగా నొక్కడం, రుద్దడం చేస్తుండాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య పోతుంది. బేబీ ఏడుస్తున్నప్పుడు ఎహ్ అనే శబ్దం వినిపిస్తే గనుక అస్వస్థత అని అర్థం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఈ ఎహ్ అనే శబ్దంతో ఏడ్చినప్పుడు బర్ప్ చేయాల్సి ఉంటుంది. అలానే బేబీకి జ్వరం గానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గానీ, స్కిన్ ఇరిటేషన్ గానీ ఉన్నాయేమో చెక్ చేయాలి.