వింత సంఘటనలు జరిగిన వెంటనే దేవుడు మహిమో అని లేదా ‘కాలజ్ఞానం’లో బ్రహ్మం చెప్పినట్లే జరుగుతోందని పలువురు చర్చించుకుంటారు. అలాగే పశువులు, మనుషులు వింతగా జన్మించినప్పుడు కూడా ఇదే మాటలు వినిపిస్తుంటాయి. తాజాగా ఇటువంటి వింత సంఘటనే చోటుచేసుకుంది.
కొన్ని ఊహించని వింత సంఘటనలు జరుగుతుంటాయి. అలా ఎందుకు జరుగుతాయో కూడా తెలియని ప్రశ్నార్థకాలుగా మిగులుతాయి. ఏదైనా వింత జరగడం ఆలస్యం.. సైన్స్ నిర్ధారించేందుకు సమయం పడుతుంది కాబట్టి.. ఇది దేవుడు మహిమో అని లేదా ‘కాలజ్ఞానం’లో బ్రహ్మం చెప్పినట్లే జరుగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. పంది కడుపున వింత జీవి పుట్టడం, పంది పిల్లకు ఆవు పాలివ్వడం లాంటి వింత ఘటనల గురించి బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని గుర్తు చేసుకుంటున్నారు. ఎనిమిది కాళ్లతో జంతువు, వింతగా పిల్లలు జన్మించిన సమయంలో వెంటనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామితో ముడిపెట్టేస్తుంటారు. అయితే అవి జన్యుపరమైన సమస్యలనీ వైద్యులు చాలా సందర్భాల్లో చెప్పారు. తాజాగా ఓ చోట వింత ఘటన చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వింత సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ మొదటి ప్రసవం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా.. ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు 24 వేళ్లు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సోమవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు ద్వారా ఈ బిడ్డ పుట్టాడు. కాగా పుట్టిన మగ శిశువు చేతులు, కాళ్లకు మొత్తం 24 వేళ్ళు ఉండటాన్ని వైద్యులు గమనించారు. అరుదుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని, ఇలా జన్మిస్తే శిశువుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు తెలిపారు. తల్లి, బిడ్డా క్షేమంగానే ఉన్నారని పేర్కొన్నారు.