చిత్తూరు- పిల్లలు ఒకప్పటిలా లేరు. తల్లి దండ్రులు ఏ మాత్రం కొప్పడినా కొంత మంది పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. నాన్నమ్మ తిట్టిందని హైదరాబాద్ లో ఓ పిల్లాడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన ఘటన మనం గతంలో చూశాం. ఇదిగో ఇప్పుడు మరో పిల్లాడు తల్లి తిట్టిందని ఇంటి నుంచి వెళ్లిపోయి, కుటుంబ సభ్యులకు ముచ్చెమటలు పట్టించాడు.
ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. నగరంలో శుక్రవారం అదృశ్యమైన 9 ఏళ్ల బాలుడు విష్ణువర్ధన్ ఆచూకీ లభించింది. స్థానిక ప్రశాంత్ నగర్ కు చెందిన గీత పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ పక్కింటి అబ్బాయితో గొడవపడటంతో తల్లి కాస్త మందలించింది. దీంతో శుక్రవారం ఉదయం స్కూల్ కని వెళ్లి, ఇక ఆ తరువాత కనిపించలేదు.
కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి నుంచి వెళ్లిన రోజు ఉదయం 9 గంటలకు ప్రశాంత్ నగర్ నుంచి నడుచుకుంటూ గిరింపేట దుర్గమ్మ గుడి దాటినట్టుగా సీసీ కెమెరాల్లో గుర్తించారు. తవణంపల్లె మండలం దిగువ తడకరలో ఉంటున్న గీత తల్లిదండ్రులు కూడా శనివారం చిత్తూరుకు చేరుకుని పిల్లాడి కోసం వెతికారు.
విష్ణువర్దన్ శుక్రవారం సాయంత్రానికే చిత్తూరు నుంచి సుమారు 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న తవణంపల్లెలో దిగువ తడకర సమీపంలోని ఓ పల్లేకు చేరుకున్నాడు. అప్పటికే రాత్రి అవ్వడంతో అక్కడే ఓ ఇంటి వద్ద పడుకుని, శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దిగువ తడకరకు వెళ్లాడు. బాలుడిని చూసిన స్థానికులు వెంటనే విషయాన్ని స్థానిక పోలీసులకు ఫోన్ ద్వార సమాచారం అందించారు.
దీంతో పోలీసులు దిగువ తడకరకు వెళ్లి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి తనను తిట్టిందన్న కోపంతో విష్ణువర్ధన్ 18 కిలో మీటర్లు నడుచుకుంటూ తన అమ్మమ్మ ఇంటి సమీపం వరకు ఎవరి సాయం లేకుండా వెళ్లడంపై పోలీసులతో పాటు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.