అమరావతి- ఆంద్రప్రదేశ్ లో అమరావతి ఉద్యమం ఆదివారానికి 600వ రోజుకు చేరుకుంది. 2020 డిసెంబరులో ప్రారంభమైన అమరావతి ఉద్యమం నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. ముందు మూడు గ్రామాలు మందడం, వెలగపూడి, తుళ్లూరులో మొదలైన ఉద్యమం కొద్దిరోజుల్లోనే రాజధానిలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ప్రస్తుం అమరావతి ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందింది.
వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధాని అమరావతిపై అనాసక్తత చూపించింది. ముందు రాజధాని పనులు నిలిపేసిన జగన్ సర్కార్, ఆ తర్వాత డిసెంబరు నెలలో మూడు రాజధానుల ప్రకటన చేసింది. అమరావతి రాజధాని తరలిపోతే తమ బతుకులు బుగ్గి పాలు అవుతాయని, అలానే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని భావించిన రైతులు ఉద్యమబాట పట్టారు. 2020 డిసెంబర్ నుంచి ఉదయాన్నే పనులు ముగించుకొని శిబిరాల బాట పట్టడం వారికి దినచర్యగా మారిపోయింది.
అమరావతి ఉద్యమంలో భాగంగా రోడ్ల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసుకొని ఉద్యమం నిర్వహించారు. అయితే కొద్ది రోజుల తర్వాత పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతుల సొంత స్థలాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. గత సంవత్సరం జనవరి నెలలో అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. మహిళలు పోలీసుల వలయాలను ఛేదించుకొంటూ ఎంపీ గల్లా జయదేవ్ సారధ్యంలో వెళ్లి అసెంబ్లీ గోడలను తాకి తమ పోరాట పటిమని చూపారు.
మార్చి నెలలో కరోన వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలోను సామాజిక దూరం పాటిస్తూ ఉద్యమాన్ని కొనసాగించారు. లాక్‌డౌన్ సమయంలోనూ రైతులు ఉద్యమాన్ని ఆపలేదు. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఆదివారానికి 600వ రోజుకు చేరిన సందర్భంగా , న్యాయస్థానం నుంచి దేవస్థానం.. పేరిట బైక్ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.