అతడో రియల్ రాబిన్ హుడ్. దోపిడీలు, దొంగతనాలు పాల్పడటం వచ్చిన డబ్బును సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అయితే ఆ గ్రామ ప్రజలకు దేవుడైన అతడు.. పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారాడు. ఇంతకు అతగాడు ఎవరంటే..?
ఇటీవల కాలంలో మన సినిమాల్లో రాబిన్ హుడ్ తరహా కథలు వచ్చాయి. అందులో విలన్ దొంగతనాలకు పాల్పడటం, దోచుకున్న డబ్బును సామాజిక సేవకు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. పోలీసులకు చిక్కకుండా, సవాళ్లను విసిరుతూ, ప్రతి సవాళ్లను ఎదుర్కొంటూ పెద్ద మొత్తంలో లూటీ చేస్తూ.. వాటిని ఏదో ఒక మంచి కార్యానికి వినియోగిస్తుంటారు. కిక్ వంటి సినిమాలు ఇందుకు ప్రేరణగా నిలిచాయని చెప్పవచ్చు. చివరకు ఆ దొంగ కోసం పోలీసులు వెతుకుతూనే ఉంటారు. అటువంటి కథలతో అనేక సినిమాలు పుట్టుకొచ్చాయి. అయితే ఇదంతా సినిమా కానీ నిజ జీవితంలో ఓ వ్యక్తి ఇలానే చేస్తున్నాడు. అతడి కోసం ఏకంగా ఆరు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారంటే.. ఎంతటి మోసగాడో అర్థమౌతుంది.
ఇంతకూ ఆ రియల్ రాబిన్ హుడ్ పేరు ఇర్ఫాన్. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని జోగియా అనే గ్రామంలో ఇర్ఫాన్ నివసిస్తున్నాడు. ఇదే ఊరిలో అతడికి 2 కోట్లు విలువ చేసే ఖరీదైన ఇల్లు ఉంది. అంతేకాదు ఆ ఊరి మొత్తాన్ని అభివృద్ధి చేశాడు. రోడ్డు, రహదారులు, వీధి లైట్లు ఏర్పాటు చేయించాడు. దొంగతనాలు, దోపిడీలు చేసి వచ్చిన డబ్బుతో ఇవన్నీ చేయిస్తున్నాడు. అంతేకాదూ అక్కడి ప్రజల కోసం ఆసుపత్రి కట్టించి.. దేవుడయ్యాడు. దోపిడీ చేస్తున్న నగదు నుండే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అయితే ఇవన్నీ ఆ గ్రామ ప్రజలకు తెలియవు. చివరకు ఇర్ఫాన్ తల్లికి సైతం తన కుమారుడు ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలియకపోవడం ఆశ్చర్యమనిపించకమానదు.
అంతేకాదూ.. ఇర్ఫాన్ భార్య జోగియా పంచాయతీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇర్ఫాన్ ఆ గ్రామానికే కాదూ.. చుట్టు ప్రక్కల ఉన్న పలు గ్రామాలను కూడా అభివృద్ధి చేశారని స్థానికులు చెబుతున్నారు. హిందువులైనా, ముస్లింలైనా ఒకేలా చూస్తాడని, ఎవ్వరూ సాయం అడిగిన.. లేదనకుండా చేస్తాడని తెలిపారు. పేద వారికి పెళ్లిళ్ల కోసం, వైద్యం కోసం డబ్బును సాయం చేస్తాడని చెప్పారు. గ్రామంలో జరిగే సామాజిక కార్యక్రమాలకు అతడే స్వయంగా డబ్బు అందిస్తాడట. ఇన్ని దోపిడీలు చేస్తుంటే పోలీసులు ఊరుకోరు కదా. ఇప్పటికే అతడిపై పలు కేసులున్నాయి. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, బీహార్, గోవా మొదలైన రాష్ట్రాలలో ఇర్ఫాన్ మీద సుమారు 69కి పైగా కేసులున్నట్టు సమాచారం.