రెండు నెలల క్రితం కేరళ పోలీసులు 300 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. దాని విలువ 3000 కోట్ల రూపాయలు. మాదక ద్రవ్యాలతో పోల్చుకుంటే హెరాయిన్ ధర ఇంత భారీగా ఎందుకు ఉంది? దీనిలో ఏముంది? వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతున్న దశలో మార్ఫిన్, హెరాయిన్‌లను నొప్పి నివారిణులుగా వాడేవారు. శస్త్రచికిత్సలు జరిగిన రోగులకు, తీవ్రమైన గాయాలకు లోనై ఇన్ఫెక్షన్లు, నొప్పులతో బాధపడేవారికి, కేన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేందుకు వీటిని వాడేవారు. బ్రౌన్ షుగర్, హార్స్, జంక్, వైట్ హార్స్ ఇవన్నీ హెరాయిన్‌కు ముద్దు పేర్లు. క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటికి నల్లమందు వాడకం మొదలైంది. క్రీస్తు శకం పదహారో శతాబ్ది నాటికి కోకా ఆకుల నుంచి `కొకైన్` తయారు చేశారు. ఇక, గసగసాల మొక్కల నుంచి హెరాయిన్‌ను తయారు చేశారు. మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ పంట పండిస్తున్నారు. హెరాయిన్ మొదటిసారి రసాయనికంగా ఇంగ్లాండ్‌లో పందొమ్మిదో శతాబ్దంలో ఉత్పత్తి అయింది. దీనిని ఔషద పరిశ్రమలో ఉపయోగించారు. దీన్ని ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెటింగ్ కి తెర లేపారు. అంతర్జాతీయస్థాయిలో మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేయడమే కాకుండా, దారుణమైన నేరాలకు పాల్పడే డ్రగ్స్ మాఫియాలు పుట్టుకొచ్చాయి.
మాదకద్రవ్యాలపై నిషేధాజ్ఞలు జారీ చేసిన తొలి దేశం చైనా. అక్కడ నల్లమందు వాడకం విపరీతంగా ఉండేది. దీంతో చైనా ప్రభుత్వం 1729లో తొలిసారిగా నల్లమందుపై నిషేధం విధించింది. ఆ తర్వాత హెరాయిన్ వంటి డ్రగ్స్‌పై కూడా నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. దుష్ర్పభావాలు తెలిశాక ప్రభుత్వాలు వీటి ఉత్పత్తిని ఆపివేయించాయి. వీటి అక్రమ రవాణా, ఉత్పత్తి మాత్రం ఆగలేదు. ఐక్యరాజ్య సమితి 1997లో విడుదల చేసిన `వరల్డ్ డ్రగ్ రిపోర్ట్` నివేదిక ప్రకారం మాదక ద్రవ్యాల ఆక్రమ వ్యాపార లాభాలు దాదాపు 4 లక్షల కోట్ల డాలర్లు. వీటిని అక్రమంగా పండించేవాళ్ళూ, నిషేధిత పదార్ధమైనా స్మగ్లింగ్ చేసేవాళ్ళు మాఫియాగా ఏర్పడి కొన్ని దేశాల్లో సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారు… అంటే అర్ధం చేసుకోవచ్చు… వీటి డిమాండ్ అండ్ సప్లై!…