తెలుగు బుల్లి తెరపై విజయవంతంగా నడుస్తున్నకామెడీ షో జబర్దస్త్. ఎన్నిషోలు వచ్చినా, దీని క్రేజే వేరు. ఏ క్షణాన మల్లెమాల ఈ ప్రోగ్రామ్ ను మొదలు పెట్టిందో కానీ.. రేటింగ్ లో కూడా అదరగొట్టేస్తోంది. ఇప్పుడంటే ఈ షో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చిన తొలి నాళ్లలోనే సక్సెస్ సాధించిందీ అంటే దాని కారణం జడ్జీలు నాగబాబు, రోజాలనే చెప్పవచ్చు. వీరి కాంబో కూడా ఈ షోను పండించింది. కానీ ఈ షో నుండి అర్ధాంతరంగా నాగబాబు తప్పుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన వెళ్లిపోయాక.. కొంత మంది టీమ్ లీడర్లు కూడా వెళ్లిపోవడంతో నాగబాబే వారిని బయటకు వచ్చేమన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన తిరిగి ఆ షోలో రాబోతున్నారని కొన్ని రోజుల నుండి టాక్ నడుస్తోంది.
జబర్దస్త్ తిరిగి ఎంట్రీపై సుమన్ టివికి ఇచ్చిన నాగబాబు ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేను వాలంటరీగా బయటకు వచ్చాను. నా అంతట నేను వెళ్లి అడగను. వాళ్లు నన్ను రమ్మని అడిగితే.. వెళతాను. కానీ అది జరగని పని. శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కూడా నాకేమీ గొడవలు ఏమీ లేవు. అప్పట్లో కొన్ని కొంత మంది స్టాఫ్ యాటిట్యూడ్ చూపించారు, కుర్రాళ్లకు అన్యాయం జరిగిందని భావించి నేను బయటకు వచ్చాను’అని చెప్పారు. జబర్దస్త్ పై తానెప్పుడూ నెగిటివ్ గా మాట్లాడలేదని అన్నారు. మీరు వెళ్లాక మీ మీద ప్రేమతో మేము నాగ బాబు వెంటే ఉంటామని, కొంత మంది బయటకు వచ్చేశారు కదా అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు.
‘నేను ఎవర్నీ రమ్మనలేదు. నా రిస్క్ నేను పడ్డాను. చంద్ర, ఆర్పీలు నాతో ఉండాలని ఉద్దేశంతో వాళ్లే రిస్క్ తీసుకుని వచ్చేశారు. చంద్ర మంచి నటుడయ్యాడు. ఆర్పీ పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టుకుని సర్వయ్ అవుతున్నాడు. కానీ ఆర్పీ చాలా నిజాయితీ, మంచివాడు. ఉన్నదీ ఉన్నట్లు చెబుతాడు. తిట్లు తింటుంటాడు. నా చేతిలో కూడా తిట్లు తిన్నాడు. కానీ ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. ఆర్పీలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు. షాప్ ఓపెనింగ్ కు రమ్మన్నాడు. కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్లలేకపోయాను’అని చెప్పారు. సుడిగాలి సుధీర్ కూడా బయటకు రావడంపై స్పందిస్తూ.. బయట ఆఫర్లు వచ్చాయని అన్నారు. బయటకు వస్తే.. వాళ్లకు నాగబాబు ఉన్నాడు అనుకుని.. మా పరిస్థితి ఏంటనీ భయంతో అక్కడే కొంత మంది ఉండిపోయారన్నారు.
శ్యామ్ ప్రసాద్ వాళ్లని తప్పు అని కూడా అనలేమన్నారు. వాళ్లకు ఉన్న కొన్ని పారామీటర్స్, రూల్స్ ప్రకారం పనిచేస్తున్నారన్నారు. మల్లెమాల, ఈ టివి వాళ్లతో తనకేమీ విబేధాలేమీ లేవని అన్నారు. మేనేజర్, కింద స్థాయి ఉద్యోగుల కారణంగా సమస్యలు వస్తాయన్నారు. యాజమాన్యాన్ని ఇంప్రెస్ చేసేందుకు ఏవో చేస్తారని, అవి మేనేజ్ మెంట్ కు కూడా తెలియదని అన్నారు. మల్లెమాల నుండి కాల్ వస్తే ఖచ్చితంగా వెళతానని అన్నారు. జబర్దస్త్ షో కోసం తాను తెరపై కాకుండా, తెర వెనుక వర్క్ చాలా చేశానని, ఇది శ్యామ్ ప్రసాద్ రెడ్డికి కూడా తెలియదన్నారు. రెమ్యునరేషన్ తీసుకొని వెళ్లిపోవచ్చు కానీ.. షోలో చేసే వారందరినీ ఎంకరేజ్ చేసేవాడని, మోటివేట్ చేశానని తెలిపారు.