సాధారణంగా సినీ, టీవీ సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. దేని గురించైనా సరే అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇక అలాంటిది వాళ్లు కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారంటే మాత్రం సందేహాలు వచ్చేస్తాయి. అలా ‘నాగిని’ సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్న నటి మోహక్ చాహల్ ఆస్పత్రి పాలైంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. ఈ న్యూస్ బయటకు రావడంతో తోటీ నటీనటులతో పాటు ఆమె అభిమానులు కంగారూ పడిపోయారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని తెగ ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే స్వయంగా సదరు నటినే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నార్వేకు చెందిన నటి మెహక్ చాహల్ మన సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 2004లో ‘నీతో’ అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ఎక్కువగా హిందీ మూవీస్ చేస్తూ బిజీగా మారిపోయింది. సినిమాలతో పాటు సీరియల్స్ లో యాక్ట్ చేసిన మెహక్.. ప్రస్తుతం ‘నాగిని 6’లో నటిస్తోంది. అయితే గత కొన్నిరోజుల నుంచి న్యూమోనియాతో బాధపడ్డానని మెహక్ చెప్పుకొచ్చింది. జనవరి 2న నీరసంతో కళ్లు తిరిగి పడిపోయానని, అప్పుడు తనకు గుండెల్లో ఎవరో బలంగా అదిమినట్లు అనిపించిందని చెప్పుకొచ్చింది. కొన్నాళ్లపాటు వెంటిలేటర్ పై ఉండాల్సి వచ్చిందని, అప్పుడు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా అనిపించిందని పేర్కొంది.
‘న్యూమోనియా ఈ మధ్య తగ్గింది. నేను కాస్త రికవరీ అయ్యాను. ప్రస్తుతం ఒంట్లో బాగానే ఉంది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. అయితే నాకు హెల్త్ బాగోలేని టైంలో నేను త్వరగా క్యూర్ కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. మీ ప్రార్థనలే నాకు అండగా నిలిచాయి. అయితే నేను పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త టైం కావాలి. త్వరలో మళ్లీ నేను మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి వస్తాను’ అని మెహక్ చాహల్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇక త్వరగా కోలుకోవాలని సహ నటీనటులు కామెంట్స్ పెడుతున్నారు.