సినీ పరిశ్రమలో నటీనటుల కెరీర్ అంతా అవకాశాలపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే.. అవకాశాలు వస్తున్నాయి కాబట్టి, ఇండస్ట్రీలో నటీనటులు కంటిన్యూ అవుతున్నారని అర్థమవుతుంది. కానీ, ఇండస్ట్రీ అనేది ఓ మాయ ప్రపంచం లాంటిదే. ఎప్పుడు ఎవరు అవకాశాలతో బిజీగా ఉంటారో.. ఎవరు వర్క్ లేకుండా ఉండిపోతారో తెలియదు. కొన్నిసార్లు నటులుగా సూపర్ క్రేజ్ ఉండి కూడా అవకాశాలు లేక మిగిలిపోతుంటారు. ఇంకొందరు ఊహించని విధంగా బిజీ అయిపోతారు. అయితే.. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు.. మాకు ఎవరైనా అవకాశాలు ఇవ్వండి అని కొంతమంది మాత్రమే బహిరంగంగా అడగ గలుగుతారు.
సీరియల్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి.. కొన్నేళ్లు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ యాంకర్ గా ఫేమ్ సంపాదించుకున్న ఓ నటి.. ఏమైందోగాని కొంతకాలంగా అవకాశాలు లేక ఏ సినిమాలోనూ కనిపించడం లేదు. మరి ఏమైపోయింది? అని ప్రేక్షకులు భావిస్తున్న టైంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా కెమెరా ముందుకు వచ్చి.. అవకాశాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడం గమనార్హం. మరి ఇంతకీ ఎవరా నటి? అనంటే.. అనిత చౌదరి. బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. కస్తూరి, ఋతురాగాలు, నాన్న లాంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిత.. రాజా సినిమాలో టీవీ యాంకర్ పాత్ర ద్వారా సినిమాల్లో ఎంటర్ అయ్యింది. ఇక అక్కడినుండి నటిగా తెలుగులో దాదాపు 50కి పైగా సినిమాలు చేసింది.
మురారి, నువ్వే నువ్వే, ఛత్రపతి, ఉయ్యాలా జంపాల లాంటి సూపర్ హిట్ సినిమాలలో అనిత చేసిన క్యారెక్టర్స్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పటికీ, తానే కావాలని రిజెక్ట్ చేసిందట. ఎందుకంటే.. ముందు నుండి తనకు హీరోయిన్ గా నటించడం ఇష్టం లేదని అంటోంది అనిత. రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. ‘కస్తూరి అనే సీరియల్ కోసం పవన్ కళ్యాణ్ తో ‘తొలిప్రేమ’ మూవీ మిస్ చేసుకున్నానని. ఆ తర్వాత మరోసారి పవన్ తో ‘తీన్ మార్’ ఛాన్స్ వచ్చినా కుదరలేదు. అలా కెరీర్ లో వదులుకున్న అవకాశాలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. అనంతరం.. ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, క్యారెక్టర్స్ కూడా మనకు రాసి పెట్టి ఉంటేనే వస్తాయని తెలిపింది.
ఇకపోతే కొన్నేళ్లుగా పెద్దగా కనిపించని అనిత.. ఇప్పుడు అవకాశాలు కావాలని రిక్వెస్ట్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘జీవితంలో అన్ని రోజులు చూసేశాను. అక్కినేని ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. నాగేశ్వరరావు గారు వాళ్ళ తోట నుండి జామకాయలు తెప్పించి ఇచ్చేవారు. అలాగే నాగార్జున గొప్ప టీచర్. నాపై ఎప్పుడూ పంచులు వేస్తుంటారు. ఇక నాకు బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో పాటు చాలామంది సినిమాలలో నటించాలని ఉంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి! నేను కూడా ఎప్పుడూ ఎక్సపెక్ట్ చేయలేదు. ఇలా అవకాశాల కోసం అడగాల్సి వస్తుందని’ అంటూ రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం అనిత చౌదరి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అనితకు అవకాశాలు లేవా అంటూ షాకవుతున్నారు ప్రేక్షకులు. మరి ఇకనైనా ఇండస్ట్రీవారు అనిత మనవిని మన్నించి అవకాశాలు ఇస్తారేమో చూడాలి. మరి మీ దృష్టిలో నటి అనిత చౌదరి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.