మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా వల్లే తన కెరీర్ అర్ధాంతరంగా క్లోజ్ అయిందని ఒక స్టార్ సింగర్ ఆరోపించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..!
మూవీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. టాలెంట్ ఉన్న ఎంతో మంది ఛాన్సులు లేక వేరే కెరీర్ల వైపు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో అవకాశం అంత సులువుగా రాదు. కానీ ఛాన్స్ వస్తే దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమే. యాక్టర్స్ సంగతి అటుంచితే.. సినీ పరిశ్రమలో టెక్నీషియన్స్, సింగర్స్, రైటర్స్ నిలదొక్కుకోవడం కష్టమే. ముఖ్యంగా సింగర్స్ విషయంలో ఒక్క పాటతో వాళ్ల ఫేట్ మారిపోతుంది. సాంగ్ బాగుంటే రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతారు. పాట సరిగ్గా రాకపోతే అదేస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే సింగర్ల కెరీర్లో మ్యూజిక్ డైరెక్టర్లది కీలక పాత్ర అని చెప్పొచ్చు. సంగీత దర్శకుడి సహకారం, అండ ఉంటే సింగర్లకు ఢోకా ఉండదు. కానీ వాళ్లే వ్యతిరేకమైతే సింగర్ల కెరీర్ ముగిసిపోయినట్లేనని చెప్పొచ్చు.
మ్యూజిక్ డైరైక్టర్తో ఉండే రిలేషన్‌ను బట్టే సింగర్స్ కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి గాయకులు తమ కెరీర్లో ఇంత పేరు, గౌరవం సంపాదించడం వెనుక వారికి ఉన్న స్వీయ ప్రతిభతో పాటు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే సంగీత దర్శకుల తోడు కారణమని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. అదే మ్యూజిక్ డైరెక్టర్స్‌తో చెడితే మాత్రం సింగర్స్ కెరీర్ ప్రమాదంలో పడినట్లే. తన కెరీర్ కూడా అలాగే ముగిసిందని అంటున్నారో స్టార్ సింగర్. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ‘రోజా’ చిత్రం గుర్తుంది కదా. అందులోని ‘చిన్ని చిన్ని ఆశ’ పాట ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్‌ను మిన్మిని అనే గాయని పాడారు. ‘రోజా’ మూవీతో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు.
‘చిన్ని చిన్ని ఆశ’ పాటతో మిన్మిని కెరీర్ డేంజర్లో పడింది. ఈ పాట తర్వాత మాస్ట్రో ఇళయరాజా ఆమెకు తన వద్ద సాంగ్స్ పాడే అవకాశం ఇవ్వలేదట. ఈ సాంగ్ కంటే ముందు ఇళయరాజా వద్ద మిన్మిని రెగ్యులర్‌గా పాడేవారట. ఇళయరాజా తనకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ‘రెహమాన్ కంపోజిషన్‌లో నేను పాడిన విషయం తెలియగానే.. వేరే చోట ఎందుకు పాడుతున్నారు? నా దగ్గరే పాడాలి’ అని మిన్మినితో ఇళయరాజా అన్నారట. దీంతో తనకు కన్నీళ్లు ఆగలేదని.. ఇది ఒక రికార్డింగ్ స్టూడియోలో మైక్ ఆన్‌లో ఉన్నప్పుడు జరిగిందన్నారు మిన్మిని. ఈ ఉదంతం తర్వాత ఇళయరాజా తనను సాంగ్స్ పాడేందుకు పిలవలేదని ఆమె స్పష్టం చేశారు. ఇళయరాజా బిహేవియర్ బయటపెట్టిన మిన్మిని.. తన తన కెరీర్ అర్ధాంతరంగా ముగిసేందుకు ఆయనే కారణమని పరోక్షంగా పేర్కొన్నారు. కెరీర్ పీక్‌లో ఉన్న టైమ్‌లో వాయిస్ కోల్పోవడంతో సింగింగ్ మానేయాల్సి వచ్చిందని మిన్మిని వివరించారు.