వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఏపీలో సినిమా టికెట్స్ రేట్స్ పై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఎల్లప్పుడూ వైసీపీకి సానుకూలంగా ఉంటూ వేరే నాయకులపై సెటైరికల్ సినిమాలు తీసే వర్మ.. ఫస్ట్ టైం టికెట్ రేట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. ‘ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహించడంలో భూముల్ని కేటాయించడం లాంటివి చేస్తుంది. ఇవే కాకుండా ప్రభుత్వం తరుపున ప్రోత్సాహకాలను అందిస్తుంది. తద్వారా ఉపాధి కలిగగించే కార్యక్రమాలను చేపడుతుంది. ఇలాంటి పద్ధతి సినిమా థియేటర్లతో అసలు ఉందో లేదో నాకు తెలియదు. కానీ.. ఒక పర్సన్ సినిమా తీసి తనకి నచ్చిన రేట్లు పెట్టుకుంటాడు. ఆ సినిమాని అంత డబ్బు, ఓపిక ఉన్నోడు చూస్తాడు.. లేనివాడు మానుకుంటాడు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది? ఆ హక్కు లేదు. ఒక హోటల్ పెట్టినవాడు.. తన హోటల్ లో ఇడ్లీ ధరను 10.. 100.. 1000.. ఇలా వాడికి ఇష్టమొచ్చిన రేట్స్ పెట్టుకుంటాడు. ఆ రేట్స్ నచ్చినవాడు తింటాడు, ఎక్కువ రేటు అనుకున్నోడు మానేస్తాడు. గవర్నమెంట్ వచ్చి ఇంతే రేటు పెట్టాలని ఎలా అంటుంది..? ఆ లాజిక్ ఏంటో నాకర్ధం కావట్లేదు.
బట్టలు చూసుకుందాం! షర్ట్ ఐదొందలు కావచ్చు.. ఐదువేలు కావచ్చు.. యాభై వేలు కావచ్చు.. వాడి స్తోమత కంఫర్ట్ బట్టి కొనేవాడు దాన్ని కొనుక్కుంటాడు. కొంతకాలం అమ్మకాలు జరిగినందుకు ప్రభుత్వానికి టాక్స్ వస్తుంది కదా. యాభైవేలు పెట్టి షర్ట్ కొంటుంటే.. గవర్నమెంట్ ఐదు రూపాయిలకే షర్ట్ అమ్మాలంటూ జోక్యం చేసుకోవడం ఏంటో అర్ధం కావట్లేదు. ఒక్క సినిమా టికెట్స్ పైనే రేట్లు ఫిక్స్ చేయడం ఎందుకు? జనాలు కొనే అన్నింటిపైనా ఫిక్స్ రేట్ పెట్టాలి కదా. ఉప్మా.. ఇడ్లీ.. చీరలు ఇలా అన్నింటి మీద పెట్టాలి. ఒక్క సినిమాల పైనే ఈ ఫిక్స్డ్ రేట్లు ఎందుకు.? అసలు గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది. ప్రభుత్వం పెట్టుబడి పెడితే అది వేరే సంగతి. ప్రభుత్వం ఏమైనా సినిమా తీసేందుకు డబ్బులు ఇస్తుందా? థియేటర్లు నిర్మించడానికి లోన్లు ఇచ్చారా? ఆ టెక్నికల్ ఇష్యూ నాకు తెలియదు. కానీ.. ఇవేవీ లేనప్పుడు ప్రైవేటు ప్రాపర్టీ పై ప్రభుత్వానికి రైట్ ఎలా ఉంటుంది?” అంటూ వర్మ తన అభిప్రాయాలను బయటపెట్టాడు. కొందరికి వర్మ లాజిక్ అర్ధం కావచ్చు. ఇంకొందరికి అర్ధం కాకపోవచ్చు. కానీ వర్మ అడిగింది నిజమే కదా అంటున్నారు నెటిజన్లు. మరి వర్మ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.