నటీనటులు: వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, నదియా, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతిబాబు తదితరులు
బ్యానర్: రినైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ
మ్యూజిక్: ఎస్ఎస్ తమన్
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్
నిర్మాత: అల్లు బాబీ, సిద్దు ముద్ద
రచన – దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి
ఈ మధ్యకాలంలో ప్రతివారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. మార్చి 25న ట్రిపుల్ ఆర్ మూవీతో మెగాహీరో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ వాతావరణాన్ని సాలిడ్ గా మార్చేసింది. ఈ క్రమంలో ఈ వారం (ఏప్రిల్ 8న) మరో మెగాహీరో వరుణ్ తేజ్ ‘గని’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దాదాపు మూడేళ్లుగా వరుణ్ ఈ సినిమాకోసం కష్టపడుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. రిలీజ్ డేట్స్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి. మొత్తానికి మంచి ప్రమోషన్స్ తో గని విడుదలైంది.
ఈ సినిమాలో స్టార్ కాస్ట్ తో పాటు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మెగాఫ్యాన్స్ లో గని పై హైప్ బాగానే ఏర్పడింది. వరుణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా గని తెరకెక్కింది. దాదాపు రూ. 35 కోట్ల బడ్జెట్ ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను తెరమీదకు తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. ఓవర్సీస్ లో ముందురోజే గని సందడి మొదలైంది. అయితే.. బాక్సింగ్ నేపథ్యంలో ఇదివరకు చాలా సినిమాలు వచ్చాయనే సంగతి అందరికి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించడం విశేషం. మరి వరుణ్ తేజ్ బాక్సర్ గనిగా ప్రేక్షకులను ఎంతవరకు సంతృప్తి పరిచాడు? అసలు గని కథేంటి? మెగాహీరో హిట్టు కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం!కథ:
వరుణ్ తేజ్ ఇదివరకు మాస్ సినిమాలు చేసినా స్పోర్ట్స్ డ్రామా ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా కథ విశాఖపట్నంలో సాగుతుంది. గని(వరుణ్ తేజ్).. చిన్నతనంలో తన తండ్రి విక్రమాదిత్య(ఉపేంద్ర)కి జరిగిన అవమానాల కారణంగా ఫ్యూచర్ లో బాక్సర్ అవ్వాలని ఫిక్స్ అయిపోతాడు. తండ్రిపై ఫుల్ నెగటివ్ ఒపీనియన్ తో పెరుగుతాడు. కానీ తల్లి మాధవి(నదియా) అసలు బాక్సింగ్ జోలికి వెళ్ళకూడదని గనితో ఒట్టు వేయించుకుంటుంది. తల్లికి తెలియకుండానే గని బాక్సింగ్ లో ఛాంపియన్ అవ్వాలనే కోరికతో కష్టపడి సీక్రెట్ గా శిక్షణ తీసుకుంటాడు. బాక్సర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న క్రమంలో విషయం తల్లికి తెలుస్తుంది. కానీ కొడుకు ఆశయాన్ని గుర్తించి తల్లి సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో తండ్రి గురించి షాకింగ్ విషయం తెలుస్తుంది. అప్పటినుండి గనికి బాక్సింగ్ లో కొందరు అడ్డుపడుతుంటారు. మరి గనికి తండ్రి గురించి తెలిసిన విషయమేంటి? బాక్సింగ్ లో అడ్డుగా నిలిచినవారిని ఎలా ఎదుర్కొన్నాడు? బాక్సింగ్ కోసం పక్కనపెట్టిన లవ్ ఏమైంది? తన ఆశయాన్ని చేదించాడా లేదా? అనేది తెరపైనే చూడాలి.
గని ట్రైలర్ చూసినవాళ్లందకి దాదాపు సినిమా కథేంటి అనేది అర్థమైపోతుంది. బాక్సింగ్ వద్దని ఒట్టు వేయించుకున్న తల్లి.. ఆ తల్లికి తెలియకుండా బాక్సింగ్ లో ఛాంపియన్ అయిపోవాలని తాపత్రయపడే కొడుకు గని. కానీ అసలు గని బాక్సింగ్ ఎందుకు ఎంచుకున్నాడు? అతని లక్ష్యం ఏంటి? అనేవి సినిమా స్టార్టింగ్ లోనే చెప్పేసారు మేకర్స్. భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో గని కాలేజీ లైఫ్, అతని గోల్, మదర్ సెంటిమెంట్స్, లవ్ ట్రాక్ తో నడిపించారు. గని అసలు కథ సెకండాఫ్ లోనే మొదలవుతుంది. సెకండాఫ్ లో తన తండ్రికి, తనకు అడ్డుపడిన వాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఆసక్తికరంగా చూపించారు.గని స్పోర్ట్స్ డ్రామా కాబట్టి కామెడీ, లవ్ ట్రాక్, బలమైన ఎమోషన్స్ ఎక్సపెక్ట్ చేస్తే మాత్రం కష్టమే. బాక్సింగ్ ఆటకు సంబంధించిన ఫుల్ క్లారిటీగా తెరకెక్కించారు. సినిమాలో క్యారెక్టర్స్ కోసం బెస్ట్ యాక్టర్లను ఎంపిక చేసుకున్నారు. కానీ వాళ్ల నుండి ప్రేక్షకులు ఆశించిన స్థాయికి రీచ్ అవ్వలేకపోయారనే చెప్పాలి. అన్ని బాక్సింగ్ సినిమాలలాగే గని కూడా ఛాంపియన్ అనే లక్ష్యంతోనే ఉంటాడు. అయితే.. ఇలాంటి సినిమాల్లో ఎలాగైనా చివరికి హీరో గెలుస్తాడని అందరూ అంచనా వేయగలరు. ఈ సినిమాలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఈజీగా గెస్ చేయగలరు ఫ్యాన్స్, ఆడియన్స్. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ లోపించి.. నిడివి విషయంలో ఫ్యాన్స్ నిరాశ చెందే అవకాశం ఉంది. ఎందుకంటే.. గని సినిమా లెన్త్ ప్రేక్షకుల ఓపికకు పరీక్షపెట్టేలా ఉంది. దర్శకుడు ఫోకస్ అంతా గని, విక్రమాదిత్య పాత్రలపైనే పెట్టినట్లుగా అనిపిస్తుంది. కామెడీ, బలమైన ఎమోషన్స్, కంటతడి పెట్టించే సన్నివేశాలు, లవ్ ఇలా ఏది పూర్తి స్థాయిలో చూపించలేకపోయారు.
ఈ సినిమాకి మేజర్ ప్లస్ సినిమాటోగ్రఫీ.. జార్జ్ సి విలియమ్స్ కెమెరా వర్క్ వందశాతం అదిరిపోయింది. క్లైమాక్స్, బాక్సింగ్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయంటే అది కెమెరా వర్క్ వల్లే అని చెప్పవచ్చు. ఇక ఫస్ట్ సినిమా అయినప్పటికీ ప్రొడ్యూసర్స్ సిద్ధు, బాబీ నిర్మాణ విలువలు టాప్ లెవెల్ లో ఉన్నాయి. సినిమా కోసం ఖర్చుల్లో ఎక్కడా కంప్రమైస్ అయినట్లులేరు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం బాగుంది. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్స్ ఎలివేట్ చేశాడు. అబ్బూరి రవి మాటలు పెన్ పవర్ కొన్ని సీన్స్ లో బయటపడింది.ఈ సినిమా పూర్తిగా వరుణ్ తేజ్ షో అనే చెప్పాలి. గని పాత్రలో మెగాప్రిన్స్ వరుణ్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్, బాక్సింగ్ సన్నివేశాలలో చాలా ప్రొఫెషనల్ గా కనిపించాడు. ఈ సినిమాలో మొదటి నుండి చివరివరకు వరుణ్ తేజ్ ఎఫర్ట్స్ కనిపిస్తాయి. అతను ట్రైన్ అయిన తీరు, సినిమా కోసం తాను పడిన కష్టం స్క్రీన్ పై మెప్పిస్తాయి. కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న వరుణ్ కి స్పోర్ట్స్ డ్రామా కొత్తే అని చెప్పాలి. కానీ ఎక్కడకూడా తను బాక్సింగ్ కి కొత్త అని తెలియకుండా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో వరుణ్ యాక్టింగ్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ మాయ పాత్రలో సయీ మంజ్రేకర్ పర్వాలేదనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో తప్ప ఆమె పాత్రకు సెకండాఫ్ లో స్కోప్ లేదు. కనిపించినంత వరకు మెప్పించే ప్రయత్నం చేసింది. డెబ్యూ అయినప్పటికీ తెలుగు డైలాగ్స్ బాగా పలికింది. కానీ మాయ పాత్రకి సరైన ఎండింగ్ చూపించలేదు మేకర్స్.
గని తల్లి మాధురీ పాత్రలో నదియా నటన ఆకట్టుకుంటుంది. నదియా తల్లి పాత్రల్లో ఎమోషన్స్ బాగా పందించగలదని ప్రేక్షకులకు తెలుసు. కానీ ఆమె నుండి కావాల్సినంత నటన రాబట్టలేదేమో అనిపిస్తుంది. గని తండ్రి, బాక్సర్ విక్రమాదిత్యగా కన్నడ స్టార్ ఉపేంద్ర అదరగొట్టాడు. ఈ సినిమాలో వరుణ్ పాత్ర తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర అంటే ఉపేంద్రదే అని చెప్పాలి. స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ తన మార్క్ యాక్షన్ తో, ఎమోషనల్ టచ్ తో మెప్పించాడు. గని కోచ్ విజయేంద్ర సిన్హా పాత్రలో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి నటన బాగుంది. డైలాగ్స్ హిందీలో చెప్పినప్పటికి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎక్సప్రెషన్స్ ఇచ్చారు.బాక్సింగ్ గేమ్ ని బిజినెస్ గా మార్చిన విలన్ ఈశ్వర్ పాత్రలో జగపతిబాబు మరోసారి తన మార్క్ విలనిజం ట్రై చేశారు. అలాగే సినిమాలో మరో బాక్సర్ ఆది పాత్రలో నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇగో హర్ట్ అయిన బాక్సర్ గా హావభావాలు బాగా పండించాడు. ఇంకా సినిమాలో యాక్టర్ నరేష్, తనికెళ్ళ భరణి లాంటి ప్రముఖులు ఉన్నప్పటికీ వాళ్ల పాత్రలు కొన్ని సీన్స్ వరకే పరిమితం అయ్యాయి. ఓరల్ గా గని బాగుంది అనిపించింది.
వరుణ్ తేజ్, ఉపేంద్రల యాక్టింగ్
బాక్సింగ్ ఎపిసోడ్స్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
రన్ టైమ్
వీక్ ఎమోషన్స్
స్లో నేరేషన్
చివరిమాట:
అంచనాలు రీచ్ అవ్వని గని పంచ్!