తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తన సత్తా చాటారు. ఆయన నట వారసులుగా మంచు విష్ణు, మనోజ్ లతో పాటు మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మంచు లక్ష్మి వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తన యాంకరింగ్ తో అందరినీ ఆకర్షిస్తుంది. ఆ మధ్య మంచు లక్ష్మి హూస్ట్ గా చెఫ్ మంత్ర అనే షో ఒకటి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి ఆడియన్స్ ని బాగా ఆకర్షించింది. ఇందులో సినీతారలు తెగ సందడి చేశారు. ఇప్పుడు ‘చెఫ్ మంత్ర’ సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది మంచు లక్ష్మి.
మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ‘చెఫ్ మంత్ర’ సీజన్ 2 సందడి మొదలైంది.. దీనికి సంబంధించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈ ప్రోగ్రామ్ కి అతిథులుగా గెటప్ శ్రీను, యాంకర్ రష్మీ గౌతమ్ లు వచ్చారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి వేసిన కొన్నిప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. ఈ షో లైవ్ లో గెటప్ శ్రీను జబర్ధస్త్ సుడిగాలి సుధీర్ కి మోహన్ బాబు వాయిస్ తో ఫోన్ చేసి ఆటపట్టించాడు. అంతేకాదు రష్మీతో మాట్లాడమని ఇచ్చాడు. సుడిగాలి సుధీర్ ‘హే.. రష్మీ ఎలా ఉన్నావ్’ అంటూ ఆప్యాయంగా పలకరించాడు. అలా పలకరించడంతో రష్మీ ఎంతగానో సిగ్గుపడిపోయింది. తనలో తాను మురిసిపోయింది. పక్కనే ఉన్న గెటప్ శ్రీను.. సిగ్గూ మొగ్గాలీ అంటూ పాట పాడి రష్మీని ఆటపట్టించాడు.
జబర్ధస్త్ ప్రోగ్రామ్ లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ జోడీ గురించి తెలియని వారు ఉండరు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండిస్తారని అంటారు. వెండితెరపై ప్రభాస్, అనుష్క జోడి చూసి ఎలా అయితే అభిమానులు ముచ్చట పడతారో అలా బుల్లితెరపై ఈ ఇద్దరి జోడీ చూసి ముచ్చట పడుతుంటారు. జబర్ధస్త్ లో వీరిద్దరి లవ్ ట్రాక్ గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. అప్పట్లో ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్లు తెగ హల్ చల్ చేశాయి. ఈ విషయం గురించి ప్రస్తావించిన ప్రతిసారి తాము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకునేవారు రష్మీ, సుడిగాలి సుధీర్. ఏ సందర్భంలో అయినా వీరిద్దరూ కలిసినా.. మాట్లాడినా భావోద్వేగానికి గురవుతుంటారు. ఒకరి కష్టం మరొకరు విన్నప్పుడు కన్నీరు పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న చెఫ్ మంత్ర సీజన్ 2 గెటప్ శ్రీను లైవ్ లో రష్మీతో మాట్లాడినపుడు ఎంతో ఎమోషనల్ అయ్యింది రష్మీ. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.