పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా సమావేశాలలో పాల్గొంటూ పర్యటిస్తున్నారు. ఇటీవల వైజాగ్ లో జరిగిన జనసేన పర్యటన తర్వాత.. పవన్ కళ్యాణ్ పై కుట్ర జరుగుతుందా? లేక ఆయనపై హత్యాయత్నాలు జరుగుతున్నాయా? అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, పార్టీలో అభిప్రాయ బేధాలు.. అధికార పార్టీతో వాదనలు.. విమర్శల మధ్య పవన్ కళ్యాణ్ ని హత్య చేయాలని చూస్తున్నారంటూ కేసు నమోదైన విషయం సంచలనంగా మారింది.
గతనెలలో జనవాణి పర్యటన కోసం వైజాగ్ కి వెళ్లిన పవన్ ని పోలీసులు అడ్డుకోవడం.. ర్యాలీ కొనసాగుతున్న టైంలో వీధి దీపాలు ఆర్పేయడం.. చీకట్లో ర్యాలీ సాగినప్పటికీ పోలీసులు బెదిరింపులకు పాల్పడటం అనేది వివాదాస్పదంగా మారాయి. దాదాపు రెండు రోజులపాటు సాగిన ఆ ఉద్రిక్త వాతావరణం రాజకీయంగా వేడి పుట్టించాయి. ఆ తర్వాత అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలను పవన్ విడిపించి విజయవాడకి షిఫ్ట్ అయ్యారు. అయితే.. వైజాగ్ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో పవన్, నాదెండ్ల కార్లను కొందరు గుర్తు తెలియని దుండగులు వెంబడించారని జనసేన నాయకులు ఆరోపించారు.
అంతేగాక పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది సెక్యూరిటీతో గొడవపడిన దృశ్యాలు బయటికి వచ్చేసరికి.. పవన్ పై కుట్ర చేస్తున్నారనే వార్తలకు బలం చేకూరింది. పవన్ పై కుట్ర చేస్తున్నారంటూ రెక్కీ నిర్వహించిన వీడియోలు, ఫోటోలు కూడా జనసేన నేతలు పోలీసులకు అందజేశారు. వైజాగ్ ఘటన తర్వాత ఇలాంటి సంఘటనలు, అనుమానస్పద రీతిలో పార్టీ కార్యాలయం, జూబ్లీ హిల్స్ లోని పవన్ ఇంటి వద్ద కొందరు అగంతకులు కనిపించడంపై సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రంగంలోకి దిగి బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇంటివద్ద సెక్యూరిటీని పెంచినట్లు జనసేన వర్గాల సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.