సినిమా– రాజ రాజ చోర
తారాగణం – శ్రీ విష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, ఇంటూరి వాసు, గంగవ్వ తదితరులు
దర్శకత్వం – హితేశ్ గోలి
నిర్మాతలు – టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
రాజ రాజ చోర పరిచయం..
కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమా ధియేటర్లు మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఓటీటీ బాట పట్టిన సినిమాలు మళ్లీ ధియేటర్స్ లో విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇటువంటి సమయంలో హీరో శ్రీవిష్ణు రాజరాజచోర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై కొంత హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ రోజు ఆగష్టు 19న విడుదలైన రాజ రాజ చోర సినిమా ఎలా ఉందో చూసేద్దామా..
రాజ రాజ చోర.. కధ
రాజ రాజ చోర కధ చాలా సింపుల్ గా ఉంది. భాస్కర్ (శ్రీవిష్ణు) జిరాక్స్ షాపులో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో తనకు నచ్చిన విద్య (సునైన)కు అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకుంటాడు భాస్కర్. ఇంకేముంది వారికి ఓ కొడుకు కూడా పుడతాడు. అంతలోనే తనకు అబద్దం చెప్పి పెళ్లి చుకున్న సంగతి విద్యకు తెలిసిపోతుంది. అబద్దం చెప్పి, మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు పోలీసు కేసు పెడతానని భాస్కర్ ను బెదిరిస్తుంది విద్య. ఐతే అలా కేసు పెట్టకుండా ఉండాలంటే తనకిష్టమైన లాయర్ కోర్సు చదివించాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది విద్య, అందుకు అంగీకరించిన భాస్కర్ ఆమెను లా చదివిస్తుంటాడు.
ఈ క్రమంలో సంజన (మేఘా ఆకాశ్)తో ప్రేమలో పడతాడు భాస్కర్. ఆమెకు సంజన సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండటంతో, ఆమె ప్రేమ కోసం తాను కూడా సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ నని అబద్దం చెబుతాడు. ఓ వైపు భార్య చదువు, మరో వైపు ప్రేమించిన అమ్మాయితో జల్సాల కోసం ఖర్చులు బాగా పెరిగిపోతాయి. చేసేది లేక భాస్కర్ చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడతాడు. ఇలా చిన్న చిన్న దొంగతనాలకంటే ఒకేసారి ఓ పెద్ద దొంగతనం చేసి, ప్రేమించిన సంజనను తీసుకుని దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటాడు భాస్కర్.
ఇదే సమయంలో సీఐ విలియం రెడ్డి(రవిబాబు) డ్యూటీ చేసే ప్రాంతంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో, అతనిపై అధికారులు ఫైర్ అవుతుంటారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న అతను ఎలాగైనా ఈ దొంగతనాల కేసును ఛేదించాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో భాస్కర్ ఓ దొంగతనం చేస్తూ విలియం రెడ్డికి దొరికిపోతాడు. ఐతే సీఐ విలియం రెడ్డి సైతం ఓ తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉండటంతో కధ రసకందాయంలో పడుతుంది. పోలీసులకు చిక్కిన భాస్కర్ ఎలా తప్పించుకున్నాడు, సీఐ విలియం రెడ్డి చేసిన తప్పేంటీ, భార్యను వదిలేసి భాస్కర్ ప్రేమించిన సంజనతో వెళ్లిపోయాడా.. ఇదంతా తెలియాలంటే మాత్రం ధియేటర్ లో రాజ రాజ చోర చూడాలి కదా..
రాజ రాజ చోర.. ఎలా ఉందంటే..
సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో చేసే దొంగతనాలు, పోలీసులకు చిక్కడం, హీరో భార్య, ప్రేయసితో సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. హీరోకు అప్పటికే పెళ్లై, కొడుకు ఉన్నాడన్న సంగతిని ఆకట్టుకునేలా చెప్పాడు దర్శకుడు. ద్వితీయార్ధంలో హీరో తన భార్య సునైన, సీఐ విలియం రెడ్డితో ఎక్కువ కధ సాగుతుంది. అబద్దాలు చెప్పడం, దొంగతనాలు చేయడం వల్ల ఎంత మంది ఇబ్బంది పడతారు, ఎంత మంది జీవితాలు కష్టాల్లో పడతాయి అన్న విషయం హీరోకి అర్ధమయ్యే సిచ్యువేషన్ ను బాగా క్రియేట్ చేషాడు దర్శకుడు. సినిమాలో కామెటీ, సెంటిమెంట్, ఎమోషనల్, కొంత సస్పెన్స్ ఉంది.
రాజ రాజ చోర సినిమా కధ సాద్యమైనంత వరకు బోర్ అనిపించదు. ఇప్పటికే గాలి సంపత్ సినిమా చూసిన వారికి శ్రీ విష్ణు నటన గురించే తెలిసే ఉంటుంది. ఈ సినిమాలోను చాలా ఈజీగా తన పాత్రలో నటించేశాడు. రాజ రాజ చోర లో సుమారు ఇరవై నిమిషాలు పాటు సాగే ఉద్వేగభరితమైన కధ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఇక మేఘా ఆకాశ్, సునైన వారి వారి పాత్రల మేరకు నటించారు. సంగీతం బాగానే ఉన్నా, పాటలు అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. కెమెరా పనితనం బావుంది. మొత్తానికి రాజ రాజ చోర సరదగా ఓ సారి చూడొచ్చు.
రేటింగ్ 3/5