ప్రేమి విశ్వనాథ్ అంటే టక్కున గుర్తు పట్టలేరు కానీ.. వంటలక్క అంటే చాలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇట్టే గుర్తు పడతారు. పాపం.. మా వంటలక్కకు ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ.. ఆడవాళ్లు తెగ ఫీలవుతారు. అంతలా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది ప్రేమి. కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ప్రేమి. అనుమానపు భర్త.. అతగాడి కోసం గోతి కాడ నక్కలా ఎదురు చూసే సవతి.. వీరిద్దరి మధ్య నలిగిపోయే దీప పాత్రలో ప్రేమి నట విశ్వరూపం చూపిస్తోంది. ఒకప్పుడు టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోయింది ఈ సీరియల్.
అయితే మరీ ఈ చిత్ర దర్శకుడికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ.. టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న సీరియల్ నుంచి ఉన్నట్లుండి మెయిన్ క్యారెక్టర్లు అయిన డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, పిల్లలను తీసేసి.. వారు పెద్దయ్యాక కథ ఎలా ఉంటుందో చూపిద్దామని ట్రై చేశాడు. కానీ ప్రేక్షకులు దర్శకుడి ప్రయత్నాన్ని ఏమాత్రం ఆమోదించలేదు. దెబ్బకు రేటింగ్స్ పాతళంలోకి పడిపోయాయి. తప్పు గ్రహించి.. మళ్లీ దీప, కార్తీక్, మోనిత, పిల్లల పాత్రలను ప్రవేశ పెట్టి.. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రన్ చేస్తున్నాడు.
ఇక సోషల్ మీడియాలో వంటలక్క రచ్చ మాములుగా ఉండదు. ఆ పేరుతో బోలేడు మీమ్స్, కామెడీ ట్రాక్‌లు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే ప్రేమి తెలుగులో కేవలం కార్తీక దీపం సీరియల్లో మాత్రమే నటిస్తుంది. ఆమెకున్న క్రేజ్‌కి.. ఈపాటికి అన్ని చానెల్స్‌లో వరుస సీరియల్స్‌లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉండాలి. కానీ ప్రేమి మాత్రం కేవలం కార్తీక దీపం సీరియల్లో మాత్రమే నటిస్తుంది. పైగా సీరియల్లో తప్ప బయట ఎక్కడా కనిపించదు.. ఇప్పటి వరకు ఆమె ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. దీని గురించి తాజాగా ఓ సందర్భంలో వివరణ ఇచ్చింది ప్రేమి.
‘‘కేవలం కార్తీక దీపం సీరియల్లో మాత్రమే నటిస్తున్నాను కదా.. మిగతా సమయం అంతా ఖాళీగా ఉంటానంటే కాదు.. నాకు కేరళలో రెండు స్టూడియలో ఉన్నాయి. అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుంటాయి. అవన్ని నేననే చూసుకోవాలి. అందుకే కేవలం కార్తీక దీపం సీరియల్ కోసం మాత్రమే హైదరాబాద్ వస్తాను. మిగతా సమయం అంతా స్టూడియో వర్క్ చూడ్డంతోనే బిజీగా ఉంటాను. నేను మోడల్‌గా కెరీర్ ప్రారంభించాను’’ అని చెప్పుకొచ్చింది. ఈ లెక్కన చూసుకుంటూ వంటలక్క ఫుల్ రిచ్ అని అర్థం అవుతోంది అంటున్నారు ప్రేక్షకులు. ఇక తాజాగా నాగచైతన్య సినిమాలో ప్రేమికి అవకాశం దక్కినట్లు వార్తలు వచ్చాయి.