మన దగ్గర సెలబ్రిటీల మీద వచ్చినన్ని పుకార్లు మరి ఎవరి మీద రావు. సోషల్ మీడియా వినియోగం లేక ముందు అయితే ఇలాంటి పుకార్లు ఎక్కువ మందికి తెలిసేవి కావు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఏ వార్త అయినా సరే నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇలా ప్రచారం అయ్యే సమాచారం నిజమయింది అయితే ఏం కాదు. కానీ తప్పుడు సమాచారం అయితే.. దాని వల్ల ఎంత నష్టం జరుగుతుందో అనుభవించే వారికే తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ చానెల్స్ వాళ్లు.. తమ వ్యూస్ పెంచుకోవడం కోసం తప్పుడు థంబ్ నెయిల్స్‌తో ఎలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇక మరి కొన్ని చానెల్స్ అయితే ఏకంగా.. సెలబ్రిటీలు చనిపోయారు అని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ఆ వార్తల వల్ల వారు ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు ఓ సీనియర్ నటుడు. కొన్ని యూట్యూబ్ చానెల్స్, న్యూస్ చానెల్స్.. సదరు నటుడు బతికుండగానే చనిపోయాడు అంటూ వార్తలు రాసుకొచ్చాయి. దాంతో ఆయన తీవ్ర ఆవేదకు గురయ్యాడు. దయచేసి నన్ను బతకనివ్వండి అని వాపోయాడు. ఆ వివరాలు.. బాలీవుడ్ సీనియర్ నటుడు ప్రేమ్ చోప్రా చనిపోయాడంటూ.. కొన్ని యూట్యూబ్ చానెల్స్, న్యూస్ చానెల్స్ వార్తలు రాసుకొచ్చాయి. దాంతో ఆయన అభిమానులు ప్రేమ్ చోప్రా ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ఈ నెల 27న ఆయన చనిపోయారంటూ కొన్ని న్యూస్ చానెల్స్, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయం కాస్త ఆయనకు తెలియడంతో.. నిర్ఘాంతపోయాడు. బతికుండగానే తనను సమాధి చేస్తున్నారేంటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా ప్రేమ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘నేను చనిపోయాను అంటూ ఎవరు ఇలా ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మిత్రులంతా ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. గతంలో నా ఆప్తమిత్రుడు జితేంద్ర కూడా మరణించాడంటూ అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు. ఇక ఈ చెత్త వాగుడు ఆపండి’ అంటూ హెచ్చరించారు. నేను చనిపోయాను అంటూ ఇలా పుకార్లు ప్రచారం చేసి.. రాక్షసానందం పొందుతున్నారు. దీన్నే శాడిజం అంటారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ప్రేమ్ చోప్రా 380కిపైగా సినిమాల్లో నటించారు. దోస్తానా, క్రాంతి, జాన్వర్, షాహీద్, ఉపకార్, పురబ్ ఔర్ పశ్చిమ్, దో రాస్తే, కటి పతంగ్, దో అంజానే, జాదు తోనా, కల సోనా వంటి పలు సినిమాల్లో ఆయన నటించారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.