ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన మూవీ ఏదైనా ఉందా అంటే అది అసురన్ అని చెప్పుకోవచ్చు. భూస్వాముల ఆధిపత్యం, కుల వ్యవస్థని ప్రశ్నించే విధంగా అసురన్ తెరకెక్కింది. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ సంచలన విజయాన్ని సొంత చేసుకుంది. అయితే.., ఇప్పుడు ఈ మూవీని విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. కరోనా నేపథ్యంలో నారప్ప ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ లో జులై 20 నుండి నారప్ప స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే నారప్ప ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఇందులో భూమి కోసం, బతుకు కోసం పోరాటం చేసే వ్యక్తిగా వెంకటేశ్ నటన అదిరిపోయే రేంజ్ లో సాగింది. ఎప్పుడూ సాఫ్ట్ గా కనిపించే వెంకటేశ్.. నారప్ప పాత్రలో జీవించేశాడని ట్రైలర్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. “వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప” అంటూ వెంకీ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలెట్.
ఇక, తెలుగు నేటివిటీకి తగ్గట్టు నారప్ప కోసం కొన్ని మార్పులు చేసినట్టు అర్ధం అవుతోంది. ఇదే సమయంలో మణిశర్మ తన మ్యూజిక్ తో హైప్ పెంచేశారు. ఇదే సమయంలో అసురన్ లోని ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా అక్కడక్కడా ఒరిజినల్ ట్రాక్స్ అలాగే ఉంచేశారు మణి. ఇక ట్రైలర్ లో చాలా తక్కువ సమయమే కనిపించినా ప్రియమణి పాత్ర కూడా ఆకట్టుకుంది. మరి ఇన్ని అంచనాల మధ్య ఓటీటీలో విడుదల కాబోతున్న నారప్ప ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.