నందమూరి నటసింహం గా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వెండితెరపై దూసుకుపోతున్నారు బాలకృష్ణ. ఇప్పటికే సినిమాల పరంగా సెంచరీ దాటేసి అపార అనుభవం కూడగట్టుకున్న ఆయన ఎన్నో ఒడిదుడుకులను చూశారు. అయితే తనకున్న అనుభవంతో ఇటీవల శ్రీకాంత్‌ను ఒక విషయంలో గట్టిగానే హెచ్చరించారట బాలకృష్ణ. ఇటీవల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
ఆయన సినిమాలు, రాజకీయాలు, కుటుంబం ఇలా అన్ని విషయాలపై స్పందించారు. ఈ తరుణంలో ఆయన నటుడు శ్రీకాంత్ కి వార్నింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే హీరోగా ఎన్నో సినిమాలు చేసిన శ్రీకాంత్ ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా సినిమాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి రూపొందిస్తోన్న ‘అఖండ’ సినిమాలో కూడా శ్రీకాంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారంట.
షూటింగ్ సమయంలో శ్రీకాంత్ ని కలిసిన బాలయ్య ఇకపై ఈ విలన్ వేషాలు వద్దని గట్టిగా చెప్పానని ఆయన అన్నారు. అతడికి ఆఫర్స్ వస్తాయని చెప్పి ఓ కథను కూడా సజెస్ట్ చేసినట్లు బాలయ్య తెలిపారు. ఆ కథకి ఓ దర్శకుడిని కూడా రిఫర్ చేశానన్నారు. సినిమాల్లో హీరోగా నటిస్తూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాగం అవుతున్న ఆయన మనసులో ఏదీ దాచుకోకుండా అన్నీ బయటపెడుతుంటారు. హీరో శ్రీకాంత్ విషయంలోనూ బాలయ్య బాబు అలాగే వ్యవహరించారట.
శ్రీకాంత్ తనకేమీ కారని కానీ ఇండస్ట్రీలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అతడికి సలహా ఇచ్చారని తెలిపారు. గతంలో శ్రీకాంత్ బాలయ్యతో కలిసి ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో నటించారు. బాలయ్య శ్రీరాముడిగా నటిస్తే శ్రీకాంత్ లక్ష్మణుడిగా కనిపించారు.