అత్తా కోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అందుకే అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనే సామెత వచ్చింది. కోడలి పెత్తనాన్ని భరించలేదు అత్త. అలాగే అత్త తనపై ప్రతి చిన్న విషయానికి విరుచుకుపడిపోవడాన్ని సహించలేదు కోడలు.
అత్తా కోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అందుకే అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనే సామెత వచ్చింది. కోడలి పెత్తనాన్ని భరించలేదు అత్త. అలాగే అత్త తనపై ప్రతి చిన్న విషయానికి విరుచుకుపడిపోవడాన్ని సహించలేదు కోడలు. దీంతో ఇద్దరి మధ్య నలిగిపోతుంటాడు కుమారుడు. ఇక కొన్నిసార్లు కొడుకు, కోడలు ఏకమైపోతే ఇక అత్తను ఒంటరి చేసి.. ఆడించే పిల్లలు ఎంతో మంది. ఆస్తి పాస్తులు రాయించుకుని.. ముసలి వయస్సుకు వచ్చిన అమ్మానాన్నలను చూసుకోవాల్సిన కొడుకులు, కోడళ్లు.. చివరికి ఇంట్లో నుండి గెంటేస్తున్నారు. ఇది సామాన్యుల విషయంలోనే కాదూ.. సెలబిట్రీల వరకు ఇదే తంతు కొనసాగుతుంది.
కొడుకు, కోడలు తనను హింసిస్తున్నారంటూ..పోలీసులకు ఫిర్యాదు చేసింది కన్నడ ప్రముఖ సీనియర్ నటి శ్యామలా దేవి. ఆమె ప్రముఖ దివంగత డైరెక్టర్ సిద్ద లింగయ్య భార్య కూడా. కన్నడలో ఆయన తీసిన బంగారు మనుష్య చిత్రం సూపర్ డూపర్ హిట్. స్ఫూర్తిదాయకమైన చిత్రంగా అప్పట్లో నిలిచింది. వీరికి నితిన్, ఉమ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం రిటైర్డ్ పోలీసు అధికారి కూతురు స్మితతో నితిన్ వివాహం జరిగింది. ఆ తర్వాత శ్యామలా దేవీ కొత్త ఇంటిని కొనుగోలు చేసి.. కొడుకు, కోడలితో ఆ ఇంట్లో ఉంటున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకు ఆ ఇంటిని తమ పేరు మీద రాయాలని కొడుకు, కోడలు వేధించడం మొదలు పెట్టారు. దానికి ఆమె ససేమీరా అనడంతో వేధించడం మొదలుపెట్టారు. సీనియర్ సిటిజన్ ఫోరంలో ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత కుమారుడు ఆమెకు క్షమాపణలు చెప్పి ఇంట్లో ఉండసాగాడు. కోడలు గర్భవతి కావడంతో ఇంటి నుండి బయటకు పంపవద్దని వేడుకున్నాడు. ఆమె ఒప్పుకోవడంతో కొన్నాళ్లు సవ్యంగా సాగిపోయింది. తిరిగి మళ్లీ ఇంటి విషయమై వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె కొడుకు, కోడలుపై బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఇల్లు తమ పేరు మీద రాయకపోతే.. తన భార్యను వరకట్న వేధింపులకు గురి చేస్తానని హింసిస్తున్నావని ఫిర్యాదు చేస్తున్నాంటూ బెదిరిస్తున్నాడని శ్యామలా పేర్కొన్నారు. లండన్ వెళ్లిన తన కుమార్తె ఉమను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని వెల్లడించారు. వంట గదితో పాటు ఏ గదిలోకి తనను రానివ్వడం లేదని, కోడలు ఇష్టమొచ్చినట్లు తిడుతుందని, వైద్యం చేయించుకునేందుకు డబ్బులు కూడా లేవని వాపోయారు. శ్యామలాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కుమారుడు నితిన్, కోడలు స్మితపై వేధింపులు, దాడి, దౌర్జన్యం, బ్లాక్‌మెయిల్ తదితర ఆరోపణలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.