సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆర్టిస్టు రైలు ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోయింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ స్టేషన్ లో రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి చెందిన బట్టినపాత జ్యోతి(26) హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఇటీవల తన స్వస్థలమైన కడపకు వెళ్లింది. సోమవారం రాత్రి హైదరబాద్ కు తిరుగు పయనమైంది. ఆమె రైల్వేకోడూరులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కి హైదరాబాద్ కు బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో రైలు షాద్ నగర్ లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకొని షాద్ నగర్ స్టేషన్ లో దిగింది.
ఆ తర్వాత అది కాచిగూడ స్టేషన్ కాదని తెలుసుకుని మళ్లీ కంగారుగా రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పటికే రైలు వేగం అందుకోవడంతో ఆమె అదుపు తప్పి ప్లాట్ ఫామ్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో జ్యోతిరెడ్డి తలకు బలమైన గాయమైంది. వెంటనే రైల్వే సిబ్బంది ఆమెను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మలక్ పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే జ్యోతిరెడ్డి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.