దేశంలో ఎక్కడైనా రైల్వే స్టేషన్లకు రైళ్లు ఆలస్యంగా వస్తాయన్న విషయం తెలిసిందే. అందుకే రైల్ పై రక రకాల మీమ్స్, జోక్స్ వేస్తూ ఉంటారు.
సాధారణంగా భారతీయ రైల్వేలపై ఎన్నో జోకులు పేలుతుంటాయి. అనుకున్న సమయం కంటే ఎప్పుడూ గంట లేటు రావడం చూస్తూనే ఉంటాం. అందుకే చాలా మంది జీవితకాలం లేటు అంటూ రైల్ ఆలస్యంతో పోల్చుతుంటారు. సోషల్ మీడియాలో అనేక మీమ్స్, ట్రోల్స్ వస్తుంటాయి. చాలా అరుదుగా అనుకున్న సమయం లేదా కొద్ది క్షణాల ముందు రైల్వే స్టేషన్ కి వచ్చి చేరుతాయి. పలు కారణాల వల్ల రైళ్లు నిర్దేశిత సమయానికి స్టేషన్లకు చేరుకోవు. దీంతో ఓపిక నశించి ప్రయాణికలు ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ రైలు అనుకున్న సమయానికి గంటన్నర ముందుగానే స్టేషన్ కి వచ్చి కొద్ది సేపటి తర్వాత వెళ్లిపోయింది. ఈ సంగతి తెలియక 45 మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ లోనే ఉన్నారు. రైలు వెళ్లిన విషయం తెలుసుకొని ఖంగు తిన్నారు. వివరాల్లోకి వెళితే..
రైల్వే స్టేషన్ కి రైళ్లు ఆలస్యంగా వస్తాయని ప్రతిఒక్కరూ అంటుంటారు. ఒక స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ మరో స్టేషన్ కి చేరుకునే సమయంలో పలు కారణాల వల్ల ఆలస్యం అవుతుంటాయి. అలాంటిది ఓ ట్రైన్ నిర్ధేశిత సమయాని కంటే 90 నిమిషాల ముందుగానే ఓ స్టేషన్‌కు చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. వాస్కోడగామా – హజ్రత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మన్మాడ్ జంక్షన్‌కు చేరాల్సిన సమయం కన్నా 90 నిమిషాలు ముందుగానే వచ్చింది. స్టేషన్ కి గురువారం ఉదయం10.35 గంటలకు ఆ స్టేషన్ కి రావాల్సి ఉండగా.. భారీ వర్షాల కారణంగా రైలు దారి మల్లించడంతో గంటన్నర ముందు అంటే 9.05లకే చేరుకుంది. ముందుగానే వచ్చినా స్టేషన్ లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నిలిచి వెళ్లిపోయింది. మరోవైపు రైల్ రాక కోసం దాదాపు 45 మంది అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు.
తాము ఎక్కాల్సిన రైలు గంట ముందుగా వచ్చి వెళ్లిపోయిందని తెలుసుకొని ప్రయాణికులు షాకయ్యారు. దీంతో తమకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని స్టేషన్ మేనేజర్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. దీంతో సిబ్బంది ఈ విషయంలో రైల్వే సిబ్బంది తప్పిదంగానే భావించి అధికారులు 45 మంది ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను మన్మాడ్‌లో ఆపి.. దానిలో జల్గావ్ కు పంపించారు. వారు వచ్చే వరకు గోవా ఎక్స్ ప్రెస్ ని అక్కడే ఆపివేశారు. దీంతో ప్రయాణికులు తమ గమ్య స్థానం చేరుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. కాగా, ఈ ఘటనలో రైల్వే సిబ్బంది తప్పిదం ఉందని.. దీనిపై విచారణ ప్రారంభించామని మధ్యరైల్వే ఉన్నతాధికారి తెలిపారు.