సెలబ్రిటీల టాక్ షోలంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాక్ షోలలో స్టార్ హీరోలను చూడాలని, వారి గురించి తెలియని విషయాలు తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు అభిమానులు. ప్రస్తుతం ఇండియాని షేక్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటిటి వారు నిర్వహిస్తున్న ఈ టాక్ షో.. మొదలైన అతికొద్ది టైంలోనే బిగ్ సక్సెస్ అయి.. దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. చిన్న హీరోల నుండి పాన్ ఇండియా స్టార్స్ వరకు షోకి హాజరవుతుండటం షో పాపులారిటీకి ప్రధాన కారణం. అయితే.. గతేడాది ఫస్ట్ సీజన్ ముగించుకున్న అన్ స్టాపబుల్.. ఇప్పుడు అన్ స్టాపబుల్ 2గా సెకండ్ సీజన్ లో దూసుకుపోతుంది.
ఇప్పటికే చాలామంది టాలీవుడ్ స్టార్స్ అంతా బాలయ్య షోలో హాజరై సందడి చేసినప్పటికీ.. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చేసరికి ఒక్కసారిగా అన్ స్టాపబుల్ షో క్రేజ్ అమాంతం పాన్ ఇండియా వైడ్ గా విస్తరించింది. ప్రస్తుతం బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోని తెలుగు ఓటిటి ఆహా వారు ప్రెజెంట్ చేస్తున్నారు. కేవలం తెలుగు వరకే ఈ షో అందుబాటులో ఉంది. అయితే.. పాన్ ఇండియా వ్యాప్తంగా ఆదరణ రావడంతో అన్ని భాషల ప్రేక్షకులకు అర్థం కావాలని సబ్ టైటిల్స్ ని కూడా వేస్తున్నారు. బాలయ్య చేస్తున్న ఈ అన్ స్టాపబుల్ షో రోజురోజుకూ హైప్ తో పాటు ఆదరణ కూడా పెంచుకుంటూ పోతుంది.
ఇదిలా ఉండగా.. తాజాగా అన్ స్టాపబుల్ షో సక్సెస్ చూసి.. బాలయ్యతో ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ఓ బిగ్ షో ప్లాన్ చేస్తోందని సమాచారం. అయితే.. ఆడియెన్స్ పరంగా ఆహా కంటే ‘నెట్ ఫ్లిక్స్’ పెద్దది కాబట్టి.. బాలయ్యతో షో అంటే ప్రపంచ దేశాలు చూసేలా ఉండబోతుందని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉండగా.. బాలయ్యతో నెట్ ఫ్లిక్స్ షో రాబోతుందని కథనాలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఇక బాలయ్య కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన చేసిన మాస్ యాక్షన్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. మరి ఒకవేళ నిజంగానే బాలయ్యతో నెట్ ఫ్లిక్స్ షో చేస్తే.. మీ అంచనాలు ఎలా ఉంటాయో కామెంట్స్ లో తెలియజేయండి.