భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో మరపురాని ఘట్టాలు చోటు చేసుకున్నాయి. సినీ పరిశ్రమ కూడా అన్ని రంగాల్లోకి విస్తరించడం మెుదలు పెట్టిన రోజులవి. అదీకాక సినీ ఇండస్ట్రీకి.. రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. అప్పటి ఎంజీఆర్, ఎన్టీఆర్ నుంచి ఇప్పటి చిరంజీవి, పవన్ కళ్యాణ్ దాక రాజకీయాలలో తమదైన ముద్ర వేసిన వాళ్లే. అయితే ఎన్టీఆర్ ప్రభంజనంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ పరిపాలనలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో అప్పట్లో ఎన్టీఆర్ ను ఢీ కొట్టింది మాత్రం ఒక్క ఘట్టమనేని కృష్ణ అనే చెప్పాలి. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న నాదెండ్ల భాస్కరరావుకు అనుకూలంగా ఓ పెద్ద పేజీలో ప్రకటన విడుదల చేశారు కృష్ణ. దాంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో మారుమ్రోగిపోయారు. అసలు రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కు ఉన్న సంబంధం ఏంటి? ఏలూరు ఎంపీ గా అంత మెజార్టీతో ఎలా గెలిచారు? రాజీవ్ గాంధీ ఉంటే కృష్ణ CM అయ్యేవారా? మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని ప్రేక్షకుడు ఉండడు. చాలా మందికి సూపర్ స్టార్ ఒక సినీ ప్రేమికుడిగా, తెలుగు ఇండస్ట్రీని కొత్త పథంలో నడిపిన దార్శానికుడిగా మాత్రమే తెలుసు! కానీ ఆయనలో చాలా మందికి తెలియని కోణం సూపర్ స్టార్ రాజకీయ ప్రస్థానం. ఇందిరా గాంధీ మరణించినప్పుడు ఆమె అంత్యక్రియలకు హాజరైయ్యారు సూపర్ స్టార్ కృష్ణ. ఇదే కృష్ణ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసిన సంఘటన చెప్పుకోవచ్చు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనం. ఇందిరా గాంధీ అంత్యక్రియల నుంచే రాజీవ్ గాంధీతో కృష్ణకు సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమంత బాగోలేదు. అన్నగారు ఎన్టీ రామారావు ప్రభంజనంతో రాష్ట్రం ఊగిపోతోంది. దాంతో ఎన్టీఆర్ కు ధీటైన మగాడి కోసం వెతకసాగింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాగేసుకున్న నాదెండ్ల భాస్కర్ రావుకు అనుకూలంగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు కృష్ణ. అప్పట్లో ఈ సంఘటన ఓ సంచలనం. అలా వారికి కనిపించిన ఏకైక వీరుడు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్టీఆర్ తర్వాత సినీ పరిశ్రమలో మళ్లీ అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న వ్యక్తుల్లో సూపర్ స్టార్ ఒకరు. రాజీవ్ గాంధీకి కృష్ణపై ఉన్న అభిమానంతో అతడిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాడు. దాంతో రాజీవ్ మాట కాదనలేకపోయాడు సూపర్ స్టార్. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సూపర్ స్టార్ పార్టీలో చేరిననాటి నుంచి రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. క్రీయాశీలక రాజకీయాల్లో దూసుకెళ్తోన్న సూపర్ స్టార్ క్రేజ్ చూసి1989లో ఎంపీ టికెట్ పిలిచి మరీ ఇచ్చింది కాంగ్రెస్. ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కృష్ణ 71 వేల మెజార్టీతో గెలిచారు. అప్పట్లో ఈ విజయం ఓ సంచలనం. దాంతో ఇటు రాష్ర్టంతో పాటు అటు హస్తినలో కూడా సూపర్ స్టార్ పేరు మారుమ్రోగిపోయింది. ఈ విజయంతో రాజీవ్ గాంధీకి మరింత దగ్గరయ్యాడు కృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ న ఎదుర్కొనే దమ్మున్న నాయకుడు సూపర్ స్టారే అని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. దాంతో కాంగ్రెస్ తరపున త్వరలో సీఎంగా సూపర్ స్టార్ కృష్ణ బరిలోకి దిగుతాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ.. రాజీవ్ గాంధీ సైతం కృష్ణతో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు.
ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురికావడంతో ఒక్కసారిగా కృష్ణ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థం అయ్యింది. రాజీవ్ గాంధీ హత్యతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచే పోటీ చేశారు కృష్ణ. కానీ ఈ సారి ఓటమి చెందారు. రాజీవ్ హత్య, ఎన్నికల్లో ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు సూపర్ స్టార్. మళ్లీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ఆయన మాటను సున్నితంగా తిరస్కరించి.. పార్టీలో చేరకుండా చనిపోయే నాటి వరకు కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరుడిగానే కొనసాగారు. అయితే రాజీవ్ గాంధీ బతికుంటే మాత్రం ఖచ్చితంగా సూపర్ స్టార్ ముఖ్యమంత్రి అయ్యేవారని అప్పటి సినీ ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు గతంలో చాలా సార్లే చెప్పారు. ఇక కృష్ణ అభిమానులు సైతం ఇదే వాదనను గట్టిగా వినిపించారు.