ఫోన్ కి లింకులు పంపిస్తారు. క్లిక్ చేస్తే క్షణాల్లో బ్యాంకులో డబ్బులు ఖాళీ చేసేస్తారు. సైబర్ మోసగాళ్ల బతుకు జట్కా బండి ఇదే. రోజూ కొన్ని వందల మందికి మెసేజులు, ఫోన్లు చేయడం.. వారి ట్రాప్ లో పడ్డ వారి బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు మాయం చేయడం ఇదే చేస్తున్నారు. తాజాగా ఈ ట్రాప్ లో నటి నగ్మా పడింది.
ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒక సందర్భంలో ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. స్పామ్ మెసేజులు, స్పామ్ లింకులు పంపించి క్లిక్ చేసేలా చేసి జనం బ్యాంకు ఖాతాల్లో డబ్బు మాయం చేస్తున్నారు. తాజాగా ఒకప్పటి హీరోయిన్, నటి, రాజకీయ నేత అయిన నగ్మా మొరార్జీని కొంతమంది కేటుగాళ్లు మోసం చేశారు. ఆమె ఫోన్ కి ఒక స్పామ్ లింక్ టిప్ కూడిన మెసేజ్ పంపించి రూ. లక్ష వరకూ కాజేశారు. నగ్మా చెప్తున్న దాని ప్రకారం తన ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చిందని.. అది బ్యాంకు నంబర్ ని పోలిన ప్రైవేట్ నంబర్ నుంచి వచ్చిందని ఆమె వెల్లడించింది. నగ్మా ఆ లింక్ పై క్లిక్ చేయగా తన ఖాతాలో ఉన్న రూ. 99,998 ఖాళీ అయ్యాయని ఆమె వెల్లడించింది.
నగ్మాలానే మరో 80 మంది బాధితులు బ్యాంక్ ఫ్రాడ్ కి గురై లక్షలు మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే ప్రైవేట్ బ్యాంకుకి చెందిన కస్టమర్లుగా పోలీసులు గుర్తించారు. ఫోన్ కి వచ్చిన మెసేజ్ లో లింక్ క్లిక్ చేయగానే తనకొక వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని.. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పినట్లు ఆమె వెల్లడించింది. కేవైసీ అప్ డేట్ చేయాలని, గైడ్ చేస్తా అని చెప్పి మిస్ గైడ్ చేసినట్లు ఆమె తెలిపింది. కేటుగాడు తన ఫోన్ రిమోట్ యాక్సెస్ పొందాడని.. అయితే లింక్ లో ఎలాంటి వివరాలు షేర్ చేయలేదని ఆమె తెలిపింది. కానీ కేటుగాడికి నగ్మా తన ఫోన్ యాక్సెస్ ఇవ్వడంతో ఆన్ లైన్ లోనే ఆమె ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అయ్యి బెనిఫిషియరీ ఖాతా యాడ్ చేసుకుని.. వాడి వ్యక్తిగత ఖాతాకు రూ. లక్ష వరకూ బదిలీ చేసుకున్నాడని నగ్మా వెల్లడించింది. కనీసం 20 సార్లు తన ఫోన్ కి ఓటీపీ వచ్చిందని ఆమె తెలిపింది. అదృష్టవశాత్తు తాను ఎక్కువ మొత్తం కోల్పోలేదని ఆమె వెల్లడించింది.
సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి మెసేజ్ లకు స్పందించవద్దని ముంబై సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ సంబంధిత మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయని, ఆన్ లైన్ కామర్స్ ప్లాట్ ఫార్మ్స్ లో మోసగాళ్లు బ్యాంక్ సిబ్బంది అని, ఆన్ లైన్ కామర్స్ వెబ్ సైట్ అధికారులమని చెప్పుకుంటూ.. కస్టమర్లను ఓటీపీ చెప్పమని, కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. కొన్నిసార్లు స్పామ్ లింక్స్ పంపుతూ బ్యాంక్ ఖాతాల్లో డబ్బు మాయం చేస్తున్నారని, ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బ్యాంకు గానీ సంస్థ గానీ బ్యాంకు వివరాలు, పిన్ వంటివి అడగదని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.
అయితే దురదృష్టవశాత్తు చదువుకున్న వారు కూడా ఆన్ లైన్ ఫ్రాడ్స్ మాయలో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. నగ్మా 90స్ లో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాష చిత్రాల్లో నటించి మెప్పించింది. 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మీరట్ నుంచి 2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసింది. 2015లో ఆలిండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎంపికైంది. మరి నగ్మా లాంటి సెలబ్రిటీలనే సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఆన్ లైన్ కేటుగాళ్ల చేతిలో నగ్మా మోసపోవడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.