ఈ ఫోటోలో ఉన్న పిల్లల్ని గుర్తుపట్టారా? ఓ కుర్రాడు తన చేతిలో ఒక రెండు, మూడేళ్ళ పిల్లాడిని ఎత్తుకున్న ఫోటో అది. ఆ ఎత్తుకున్నది ఎవరో కాదు, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. ఆ విషయం ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది. మరి నాగ్ చేతిలో ఉన్న ఆ బుజ్జోడు ఎవరో గుర్తుపట్టారా? రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చక్కని ప్రేమకథతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జునతో కలిసి ఒక బ్లాక్ బస్టర్ మూవీలో కూడా నటించడండోయ్. పాటల రచయితా దగ్గర గోస్ట్ రైటర్ గా పని చేసే పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అనుష్క, కాజల్ వంటి స్టార్ హీరోయిన్స్ తో నటించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక డీసెంట్ హిట్ కూడా కొట్టాడు.
స్కూల్ అండ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా కూడా చేశాడు. అది కూడా విజయం సాధించింది. టాలీవుడ్ లెజెండ్స్ లో ఒకరైన నాగేశ్వరరావు పాత్రలో నటించాడు. రీసెంట్ గా అందమైన ప్రేమ కావ్యంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఐడియా వచ్చిందా? అవును సుమంత్ నే ఈ బుజ్జోడు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు.. ఏఎన్ఆర్ పెద్ద కూతురు సత్యవతి,యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు, అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్. 1999లో వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. యువకుడు, స్నేహమంటే ఇదేరా, గౌరీ, ధన 51 లాంటి సినిమాల్లో నటించాడు.
నాగార్జున స్నేహితుడిగా నటించిన స్నేహమంటే ఇదేరా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత గోస్ట్ రైటర్ పాత్రలో నటించిన సత్యం మూవీ సుమంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత గౌరీ అనే మాస్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ధన 51, మహానంది వంటి కమర్షియల్ సినిమాలతోనే కాకుండా.. గోదావరి లాంటి ఫీల్ గుడ్ మూవీతో కూడా అలరించాడు. ఈ సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మధుమాసం అనే డిఫరెంట్ జోనర్ మూవీలో నటించారు. ఇది కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత సుమంత్, కాజల్ జంటగా వచ్చిన పౌరుడు సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. గోల్కొండ హైస్కూల్ సినిమాలో సంపత్ అనే క్రికెట్ కోచ్ పాత్రలో చాలా బాగా నటించాడు.
దగ్గరగా దూరంగా, ఏమో గుర్రం ఎగరావచ్చు, నరుడా డోనరుడా వంటి భిన్నమైన కంటెంట్ తో వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. అయితే వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న సుమంత్.. మళ్ళీ రావ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్, కపటదారి వంటి థ్రిల్లర్ మూవీస్ తో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఏఎన్ఆర్ పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయారు. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అద్భుతమైన ప్రేమ కావ్యం సీతారామం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించాడు.
ఈ సినిమా సుమంత్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. ప్రస్తుతం సుమంత్ ‘అనగనగా ఒక రౌడీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వాల్తేరు శీను పాత్రలో నటిస్తున్నాడు.ఇలా విభిన్నమైన కంటెంట్ తో ఆకట్టుకోవడంలో సుమంత్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు వాల్తేరు శీను అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. చూస్తుంటే ఈ సినిమాతో మరో సాలిడ్ హిట్ కొట్టేలా కనబడుతున్నాడు. ఊర మాస్ గెటప్ లో సుమంత్ లుక్ అదిరిపోయింది. ఇప్పటికే రిలీజైన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. టీజర్ ఎప్పుడొస్తుందా? ట్రైలర్ ఎప్పుడొస్తుందా? సినిమా ఎప్పుడు రిలీజవుతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సెలబ్రిటీల త్రోబ్యాక్ ఫోటోల్లో భాగంగా నాగార్జున సుమంత్ ని ఎత్తుకున్న ఈ చైల్డ్ హుడ్ పిక్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.