‘పవర్‌స్టార్ పవన్ కల్యాణ్’ ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు, ఎలివేషన్లు ఏమీ అవసర్లేదు. ఆ పేరే ఒక బ్రాండ్. అభిమానులు అందరికీ ఆయనో గాడ్. పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఉండరు.. కేవలం భక్తులే ఉంటారు అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌లాంటి వారు ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో సభా ముఖంగానే వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ నెల దగ్గర పడుతోందంటే పవన్ భక్తుల జోరు తట్టుకోలేం. సోషల్ మీడియాలో వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే హ్యాష్ ట్యాగులతోనే ట్రెండింగ్‌లోకి వెళ్లిన రికార్డు వారిది. బర్త్ డే కామన్ డీపీలు ఇలా వారు ఏది చేసిన వైరల్ అవుతుంది.
ఈసారి బండ్ల గణేష్ అయితే థియేటర్లలో ప్రత్యేకంగా ‘గబ్బర్‌సింగ్’ 100 షోలు వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2, పవన్ 50వ పుట్టినరోజు సందర్భంగా తాజాగా బుల్లితెర కమీడియన్ నవసందీప్ స్వయంగా రచించి, ఆలపించిన గీతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఆ గీతాన్ని మెగా బ్రదర్ నాగబాబు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. ‘నింగీ నేల వెలుగులతో వెన్నెల కురవాలా.. ఊరూ వాడా రంగులతో పండగ జరపాలా’ అంటూ పవన్‌పై అభిమానాన్ని నవసందీప్ పాట రూపంలో చూపించినట్లు ఇట్టే అర్థమైపోతుంది. మరి, ఆ ప్రత్యేక గీతాన్ని మీరూ ఓసారి చూసేయండి.