మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఆంధ్ర, సీడెడ్, నైజాం మాత్రమే కాదూ దేశ వ్యాప్తంగా చిరు మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మెగా అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకుని రచ్చరచ్చ చేస్తున్నారు. ఎన్నో యేళ్ల తర్వాత చిరు మాస్ లుక్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆయన సినిమా కోసం పొరుగు రాష్ట్రల్లోని వారే కాదూ విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం థియేటర్ల వద్ద హంగామా సృష్టిస్తున్నారు.
ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు ప్రదర్శితమయ్యాయి. అయితే గుంటూరు జిల్లాలోని పొన్నూరులో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఒక్కసారిగా అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బెనిఫిట్ షో చూసేందుకు శ్రీ లక్ష్మి ధియేటర్ కు ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. అయితే సాంకేతిక లోపం కారణంగా సినిమా ప్రదర్శన ఆలస్యమైంది. సినిమా ప్రదర్శించకపోవడంతో పాటు థియేటర్ యాజమాన్యం నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కోపంతో రగిలిపోయిన అభిమానులు థియేటర్ పై రాళ్లు విసిరారు. అద్దాలు పగుల కొట్టారు. దీంతో ధియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సాంకేతిక లోపం కారణంగా సినిమాను ప్రదర్శించలేకపోతున్నామని ఎట్టకేలకు థియేటర్ యాజమాన్యం వెల్లడించింది. అయినప్పటికీ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. అభిమానులను అక్కడి నుండి పంపించేశారు. కాగా, శుక్రవారం నుండి థియేటర్లలో సందడి చేస్తోన్న చిరు వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూస్తే పూనకాలు పక్కా అంటూ అభిమానులు రివ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమా మీరూ చూసినట్లయితే.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.