గత కొంతకాలం నుంచి సినిమాలు చూడటంలో ప్రేక్షకుల ధోరణి మారింది. పలానా హీరో, పలానా హీరోయిన్, డైరెక్టర్ అని సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. ప్రస్తుతం వారు సినిమా కథ ఎలాఉంది బాగుందా? లేదా? అన్న విషయాన్ని మాత్రమే చూస్తున్నారు. ఇక హీరోలు కూడా మంచి కథలకే ప్రియారిటీ ఇస్తున్నారు. కథ మంచిది అయితే ఆ సినిమా సగం విజయం సాధించినట్లే. ఇక కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే ధోరణిని పూర్తిగా మర్చారు. మరి ఇలాంటి క్రమంలోనే 2022లో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బెస్ట్ మూవీ స్టోరీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమాకు ప్రాణం కథ.. కథ బాగోకుంటే ఎంత పెద్ద హీరో చేసినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం కామనే. అందుకే కథలను ఎంచుకునేటప్పుడే హీరోలు అయోమయంలో పడుతుంటారు. కథలను ఎంచుకోవడంలోనే కొంత మంది హీరోలు సగం సక్సెస్ కొడుతుంటారు. మరి ఈ ఏడాదిలో ప్రేక్షకులను అలరించిన బెస్ట్ మూవీ స్టోరీస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ అందులో ప్రేక్షకుల మనసుల్లో పదిలంగా ఉన్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.
సీతారామం
ఈ ఏడాది అభిమానుల గుండెలను తాకిన ప్రేమ కావ్యం ఏదైనా ఉంటే అది ‘సీతారామం‘ అనే చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘గీతాంజలి’ లాంటి ప్రేమ కావ్యం తర్వాత మళ్లీ అలాంటి సినిమాగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది ‘సీతారామం’. ఓ అనాథ సైనికుడికి భార్యకాని భార్యగా నటించి మెప్పించింది మృణాల్ ఠాకూర్. ఇక ఈ సినిమా చూస్తున్నంతసేపు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తుంది ఈ కథ. ఈ ఏడాదిలోనే కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం సీతారామం ఓ మధుర ప్రేమకావ్యంలా ప్రేక్షకుల గుండెల్లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మేజర్
సాధారణ ప్రేక్షకుల మీద ఎక్కువ ప్రభావం చూపే కథలు ఏమైనా ఉన్నాయి అంటే అవి జీవిత చరిత్రలు అనే చెప్పాలి. ఈ ఏడాది అలా జీవిత కథతో వచ్చిన చిత్రం ‘మేజర్’. అమరవీరుడు మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు డైరెక్టర్ శశికిరణ్ తిక్క. టెర్రరిస్టు, ఆర్మి బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఈ కథను డైరెక్టర్ అంతే అద్భుతంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించాడు. ఎమోషన్ కథ కావడంతో ప్రేక్షకులు కూడా అంతే ఎమోషనల్ గా ఈ కథకు కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ వసూళ్లను రాబట్టింది.
తిరు (తమిళ్ డబ్)
రోజులు మారుతున్న కొద్ది చిత్ర పరిశ్రమకు హద్దులు చెరిగిపోతున్నాయి. అందులో భాగంగానే ఇండస్ట్రీలోకి తెలుగు సినిమాలతో పాటుగా డబ్బింగ్ సినిమాలు సైతం వరదలా వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్యలో టాలీవుడ్ ను ముంచెత్తాయి డబ్బింగ్ సినిమాలు. కానీ వాటిల్లో బెస్ట్ స్టోరీ ఏదైనా ఉందా అంటే అది హీరో ధనుష్ నటించిన ‘తిరు’ సినిమా అనే చెప్పాలి. ఓ మధ్యతరగతి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు మిత్రన్ ఆర్. జవహార్. ఇక ధనుష్, నిత్యామినన్ ల నటన ఈ సినిమాకు హైలెట్. అద్భుతమైన కథను అంతే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్. ఈ ఏడాది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన స్టోరీల్లో కచ్చితంగా ‘తిరు’ మూవీ ఉంటుంది.
జనగణమన (మలయాళం)
ఓ చోట జరిగిన సంఘటన.. ఆ చోటుకే పరిమితం కాదని, అది అనేక సంఘటనల సమూహం అని తెలియజెప్పిన కథ జనగణమన. ఈ మధ్య కాలంలో ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రాలేదనే చెప్పాలి. ఈ కథ నిమిష నిమిషానికి మలులుపులు తిరుగుతూ.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. సమకాలీన రాజకీయాలపై వచ్చిన అద్భుతమైన చిత్రం ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్, మమ్ముట్టీ, మమతా మోహన్ దాస్ లన నటన ప్రేక్షకులను కట్టిపేడేస్తుంది. ప్రస్తుత రాజకీయాలపై డైరెక్టర్ డిజో జోస్ ఎంటోనీ వదిలిన బాణం జనగణమన.
ఇక ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమా కథలు ప్రేక్షకులను మెప్పించాయి. వాటిల్లో హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2. డైరెక్టర్ చందు మెుండేటీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ వసూళ్లను రాబట్టింది. జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ బుజ్జి ఇలా రా! సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ఈ కోవలోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన మూవీ హీరో కార్తి నటించిన సర్ధార్. అద్భుతమైన కథతో ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు. వీటితోపాటుగా మరికొన్ని చిత్రాలు మంచి మంచి కథలతో అభిమానుల మనసుల్లో చోటు దక్కించుకున్నాయి.