టాక్ షోకా బాప్ అంటూ బాలయ్య అనడమే కాదు.. నిజంగానే అన్‌స్టాపబుల్ టాక్ షోని అగ్రస్థానంలో నిలిపారు. ఈసారి సీజన్-2లో కూడా ఇప్పటికే 3 ఎపిసోడ్లు విడుదల కాగా.. మంచి స్పందనే లభిస్తోంది. ఈసారి రాజకీయనేతలను కూడా షోకి పిలవడం విశేషం. నాలుగో ఎపిసోడ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌లో ఫ్రెండ్స్ తో కలిసి బాలకృష్ణ చేసిన సందడి అంతా ఇంతా కాదు. కాలేజ్ రోజులను గుర్తుచేసుకుంటూ అప్పట్లో మేము చేసిన పనులు చెప్తే అస్సలు నమ్మరు అంటూ బాలయ్య కామెంట్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాలు, రాజశేఖర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంక ఈ ఎపిసోడ్ మధ్యలో సీనియర్ నటి రాధిక కూడా పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి- బాలయ్య క్రికెట్ ఆడుతుండగా అంపైర్ ఉండొద్దా అంటూ రాధిక ఎంట్రీ ఇచ్చారు. నన్ను ఇంతవరకు అడగనిది ఏదైనా అడగాలి అనుకుంటున్నావా? అంటూ రాధికను అడగ్గా.. నేను అడిగితే మీరు ఇంక ఇంటికి కూడా వెళ్లరు.. భోజనం కూడా ఉండదు అంటూ సమాధానం చెప్పారు. ఈ షోలో రాధిక కూడా ఫుల్ సందడి చేశారు. అయితే లాస్ట్‌లో రాధికను ఇరకాటంలో పెట్టే ప్రశ్న ఒకటి బాలయ్య అడిగారు. చిరంజీవిలో నీకు నచ్చనిది ఏంటి? నాలో నీకు నచ్చేది ఏంటి? చెప్పు రాధిక అంటూ ట్రిక్కీ ప్రశ్న సంధించారు. దానికి రాధిక ఏం సమాధానం చెప్పారో చూడాలి అంటే నవంబర్ 25 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.