హీరోలు అంటే విపరీతంగా అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇతడు మాత్రం వారందరి కంటే స్పెషల్. అభిమాన హీరో రాకపోతే పెళ్లి చేసుకోనంటూ.. రెండేళ్లుగా మ్యారేజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నాడో ఫ్యాన్.
టాలీవుడ్ హీరోల్లో నటసింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త వేరు అనే చెప్పాలి. బాలయ్య సినిమా వస్తోందంటే చాలు.. ఆయన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతారు. ఆయన మూవీ రిలీజ్ రోజున థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. వాళ్లు జై బాలయ్య అంటూ చేసే నినాదాలకు థియేటర్లు షేక్ అవుతాయి. బాలయ్యను కలవాలని, ఆయన్ను దగ్గర నుంచి చూడాలని ఎంతోమంది కోరుకుంటారు. చాన్స్ వస్తే బాలయ్యతో ఫొటో దిగాలని కూడా అనుకుంటారు. అంతవరకు ఓకే, తప్పులేదు. కానీ ఒక అభిమాని మాత్రం బాలయ్య వస్తే కానీ పెళ్లి చేసుకోనని అంటున్నాడు.
హీరోల కోసం థియేటర్లకు వెళ్లి కాగితాలు చింపడం, చొక్కాలు చింపుకోవడం ఓకే. కానీ అంతకుమించి అనే రేంజ్లో బాలయ్య వస్తే కానీ పెళ్లి చేసుకునేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నాడో అభిమాని. విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, చింతల అగ్రహారానికి చెందిన వధూవరులు కోమలీ పెద్దినాయుడు, గౌతమీ ప్రియలకు 2019లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయితే బాలయ్య అంటే పడిచచ్చే పెద్దినాయుడు.. తన పెళ్లికి రావాల్సిందిగా వైజాగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా బాలయ్యను ఆహ్వానించాడు. అయితే షెడ్యూల్ ఖాళీగా లేకపోవడం, అనంతరం కరోనా వల్ల లాక్డౌన్ తదితర కారణాల బాలకృష్ణకు ఆ పెళ్లికి రావడం వీలుపడలేదు.
బాలకృష్ణ వస్తేనే పెళ్లి చేసుకోవాలని పెద్దినాయుడు ఫిక్స్ అయ్యాడు. పెళ్లిని వాయిదా వేస్తూవచ్చాడు. బాలయ్య షూటింగ్ షెడ్యూల్‌ను అడ్జెస్ట్ చేసుకునే విధంగా మూడ్నాలుగు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఎట్టకేలకు ఆయన వస్తానని మాట ఇచ్చారు. దీంతో మార్చి 11న మ్యారేజ్‌కు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. బాలయ్య రాక కోసం తమ ఊరు మొత్తం ఎదురు చూస్తోందని పెద్దినాయుడు అన్నాడు. ఇన్నాళ్లు పెళ్లికూతురు ఎలా ఎదురు చూశారని అడిగితే.. ఆమె కూడా నటసింహం అభిమానేనని పెద్దినాయుడు చెప్పాడు. తమ రెండు కుటుంబాలతో సహా ఊరు మొత్తం బాలయ్యకు డై హార్ట్ ఫ్యాన్స్ అని పేర్కొన్నాడు.