సినిమాలో ఆటా, పాటా హీరోయిన్లకు కామన్. అయితే సినిమాలో వేరే ఆట (స్పోర్ట్స్) ఆడాల్సి వస్తే! సినిమా ఆటే కదా అని తేలికగా తీసుకోవట్లేరు. కెమెరా ముందే అయినా.. తగ్గేదే లే! అని నిరూపిస్తున్నారు. క్రికెట్ లో కోహ్లీ ఎంత గొప్ప క్రికెటరో అందరకి తెలుసు. అంత గొప్ప ఆటగాడి భార్య అయిన అనుష్క శర్మ క్రికెటర్ గా నటిస్తూ.. మెప్పించాలంటే మాములు విషయం కాదు. విరుష్క జంటను ఆదరించే అభిమానుల సంఖ్య బోలెడు. వారందరిని మెప్పించేటట్లుగానే అనుష్క శర్మ కష్టపడుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇంతకు అనుష్క శర్మ ఇంతలా ఎందుకు కష్టపడుతుందో తెలియాలంటే ఇది చదవండి.
టీమిండియా స్టార్ బౌలర్ జూలన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా “చక్దా ఎక్స్‌ప్రెస్” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ కూడా విడుదల చేశారు. ఈ బయోపిక్‌లో గోస్వామి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నటిస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. ఇక ఈ మూవీలో భారత క్రికెట్‌కు గోస్వామి అందించిన సేవలను, సాధించిన రికార్డులను చూపించనున్నారు. ఈ సినిమాకు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, అనుష్క శర్మ, ఆమె సోదరుడు కర్ణేష్ శర్మ.. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అనుష్క శర్మ జూలన్ పాత్రకి వంద శాతం న్యాయం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని వీడియో చూస్తే అర్థం అవుతోంది.2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని, నటనకు చిన్న బ్రేక్ ఇచ్చిన అనుష్క శర్మ.. రీ ఎంట్రీలో జూలన్ గోస్వామి బయోపిక్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో క్రికెటర్ గా మెప్పించడానికి బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక.. ప్రాక్టీస్ అంటారా? ఇంట్లోనే మంచి క్రికెటర్ ఉన్నారు కాబట్టి.. క్రికెటర్ పాత్ర కోసం భర్త విరాట్ నుంచి అనుష్క టిప్స్ అడిగి తెలుసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుష్క శర్మ.. “చక్దా ఎక్స్‌ప్రెస్” చిత్రం కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ వీడియో లో అనుష్క శర్మ అల్ రౌండర్ అన్న విషయం చెప్పకనే చెపుతోంది. బాల్ తో వికెట్లు తీసే బౌలర్ గానే కాకుండా.. ప్యాడ్ లు కట్టుకొని.. బ్యాట్ తో పరుగులు రాబట్టే బ్యాటర్ గా కూడా ప్రాక్టీస్ చేస్తోంది.
ఇప్పటికే జూలన్ గోస్వామి క్యారెక్టర్ పై స్పందించిన అనుష్క శర్మ.. ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’ సినిమా.. మహిళల క్రికెట్లో చరిత్రంలో గొప్ప చిత్రంగా నిలుస్తుందని తెలిపింది. జూలన్ గోస్వామి.. క్రికెటర్ అవ్వాలని, ప్రపంచం ముందు భారత జట్టును సగర్వంగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో.. అలాంటి సవాళ్ల నడుమ ఆమె క్రికెటర్‌గా ఎదిగి ఎలా రాణించారనేదే ఈ సినిమా” అని తెలిపింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.