ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్స్ గా నిలిచి ఆశ్చర్యపరుస్తుంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు భారీ అంచనాల మధ్య అధిక బడ్జెట్ తో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోతుంటాయి. దీనంతటికి కారణం కంటెంట్. సినిమాలో దమ్ముంటే చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంటాయి. అదే సినిమాలలో కంటెంట్ లేకుంటే మాత్రం వందల కోట్లతో సినిమాలు తీసినా నేలపైనట్లే అనుకోవచ్చు.
ఎందుకంటే.. ఈ మధ్యకాలంలో హీరో హీరోయిన్లను బట్టి థియేటర్లకు వెళ్లడంకంటే.. సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్టులో దమ్ముందా లేదా అనేది లెక్కలోకి తీసుకొని వెళ్తున్నారు ప్రేక్షకులు. కొన్నేళ్ల కిందట సినిమాలలో హీరోలు ఎలాంటి అద్భుతాలు చేసినా.. లాజిక్స్ పట్టించుకోకుండా చూసేవారు. కానీ.. ఇప్పుడు పంథా మారింది. దేనికైనా కంటెంట్.. లాజిక్స్ ప్రధానమే అంటున్నారు. అయితే.. దక్షిణాది సినిమాలంటే ఇప్పుడు కంటెంట్ ప్రధానంగా తెరకెక్కి విడుదలైన అన్ని భాషల్లో హిట్ అవుతున్నాయి.
అదే బాలీవుడ్ విషయానికి వస్తే.. కంటెంట్, బలమైన స్క్రిప్ట్, లాజిక్స్ లేకున్నా కేవలం హీరోల క్రేజ్ మీద ఆధారపడి.. డబ్బు చేసుకోడానికే సినిమాలు చేస్తున్నారు. అందులోనూ ఈ మధ్య హిందీ ఆడియెన్స్ కూడా సౌత్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దానికి ఒకే ఒక్క కారణం కంటెంట్. అందుకు తాజాగా ఉదాహరణగా ‘కార్తికేయ 2‘ సినిమాని చెప్పుకోవచ్చు. నిఖిల్ హీరోగా డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
అదీగాక విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్స్ పరంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటివరకు రూ. 90 కోట్లకు పైగా వసూల్ చేసిన కార్తికేయ 2.. ప్రస్తుతం 100 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ముఖ్యంగా హిందీలో 50 థియేటర్లతో మొదలై.. ఏకంగా 1500 థియేటర్లకు పెరగడం విశేషం. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటించారు. ఆయన పాత్ర సినిమాలోని మేజర్ హైలైట్స్ లో ఒకటని చెప్పవచ్చు.
ఇక తాజాగా కార్తికేయ 2 చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అనుపమ్ ఖేర్ కూడా పాల్గొని.. సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపిస్తూ.. బాలీవుడ్ కు చురకలు అంటించారు. ఆయన మాట్లాడుతూ.. “బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో బిజినెస్ చేసి డబ్బులు వెనకేసుకోవాలని చూస్తున్నారు. అలా చేస్తే సినిమాలు చూసే ఆడియెన్స్ తగ్గిపోతారు. ఇప్పుడు బాలీవుడ్ లో అదే జరుగుతోంది. గొప్ప సినిమాలకు స్టార్ స్టేటస్ అవసరం లేదు. స్టేటస్ తో బిజినెస్ చేయాలని చూస్తే థియేటర్స్ ఖాళీ అవుతాయి తప్ప లాభం ఉండదు.
అదే సౌత్ సినిమాలను గమనించినట్లయితే.. ప్రతి సౌత్ భాషలో వారి పరిమితులకు లోబడి.. తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ కోసం సినిమాలు చేస్తుంటే.. సౌత్ లో కంటెంట్ ప్రధానంగా సినిమాలు చేయడం అభినందనీయం” అని ప్రశంసించారు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ మాటలు సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. మరి అనుపమ్ ఖేర్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.