ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మరోసారి జతకట్టనున్నారు. మరో మల్టీస్టారర్ తో మన ముందుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
మల్టీస్టారర్ సినిమాల పుణ్యమా అని హీరోల అభిమానులు ఎలాంటి బేధాలు లేకుండా కలిసిపోయారు. అక్కడక్కడా కలుపు మొక్కల్లా కొంతమంది ఉండచ్చు గాక కానీ మెజారిటీ జనాలు మాత్రం హీరోలందరినీ ఆదరించే వారే. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ సినిమా బాగా పని చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసిపోయి మరీ నటించారు. సినిమా చూస్తున్నంత సేపు అన్నదమ్ములే అన్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాతో మెగా, నందమూరి ఫ్యాన్స్ అన్న ఫీలింగ్ చెరిగిపోయింది. అంతకు ముందు వరకూ ఈ రెండు కుటుంబాల అభిమానుల మధ్య వార్ చాలా దారుణంగా నడిచేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. అంతా రాజమౌళి చలువ.
మెగా, నందమూరి హీరోలతో సినిమా చేయాలన్న ఆలోచన రావడమే ఒక గొప్ప అద్భుతం. ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని సంచలనాలను సృష్టించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఇద్దరు హీరోలు మరోసారి జత కట్టనున్నారు. చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ సినిమా రాబోతుందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ పాన్ ఇండియా హీరోలతో సినిమా ఉంటుందని అన్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఈ సినిమా ఉండబోతుందని.. అయితే ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ గా వస్తుందని అన్నారు. కానీ ఈ సినిమాకి దర్శకుడిగా రాజమౌళి ఉండకపోవచ్చునని అన్నారు.
ఈ సీక్వెల్ పై రాజమౌళి తాలూకు పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. దీంతో దర్శకుడు ఎవరన్న విషయంపై నెటిజన్స్ లో సందిగ్ధత నెలకొంది. విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేస్తారా? లేక రాజమౌళి తనయుడు చేస్తారా? లేక వేరే ఎవరైనా దర్శకుడు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమా ఎప్పుడు ఉంటుందో అనే విషయాన్ని కూడా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక మహాభారతం ఉంటుందని అన్నారు. మరి విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.