సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఇక ఆర్జీవీ ట్వీట్‌కు నెటిజనులు మద్దతు తెలపడమే కాక.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
వరంగల్ కేఎంసీ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోన్న మెడికో ప్రీతి.. సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసి.. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి మృతి చెందింది. ప్రీతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు, కాలేజీ యాజమాన్యం.. ఈ సంఘటనపై సకాలంలో స్పందించకపోవడం వల్లే ప్రీతి ఇంతటి దారుణ నిర్ణయం తీసుకుంది అనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రీతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడమే కాక.. 30 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. నిందితులను వదిలిపెట్టం.. కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. ప్రీతి కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ప్రీతిని ఆదుకున్నారు సరే.. మరి చిన్నారి ప్రదీప్ కుటుంబానికి సాయం ఎక్కడ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ దారుణంగా గాయపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అయ్యింది. నగరంలో వీధి కుక్కల వల్ల ఏటా వందల మంది ప్రజలు గాయపడుతుండగా.. కొందరు మృతి చెందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక ప్రదీప్ మృతికి జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ అదికారుల నిర్లక్షమే కారణం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ను 5 లక్షల కుక్కల మధ్యలో పడేయాలి.. అప్పుడే ఆమెకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
ఈ సంఘటన జరిగిన నాటి నుంచి ప్రదీప్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తోన్న ఆర్జీవీ.. తాజాగా బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంపై స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘మెడికో ప్రీతి మృతి చెందడం దురదృష్టకరం. ప్రభుత్వం ఆమె కుటుంబానికి 30 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది అని తెలిసి.. కాస్త ఊరట కలిగింది. ప్రీతి కుటుంబాన్ని ఆదుకున్నారు మంచిదే.. కానీ ప్రదీప్ కుటుంబానికి సాయం ఎక్కడ’’ అంటూ ఆర్జీవీ ప్రశ్నించాడు. ప్రసుత్తం ఈ ట్వీట్ వైరలవుతోంది. చాలా మంది నెటిజనులు ఆర్జీవీకి మద్దతు తెలుపుతున్నారు.
Glad to know the authorities are paying an ex gratia of 30 lak towards the unfortunate death of Ms.Preethi the medico ,But why there’s nothing for the family of Pradeep who was killed by DOGS ??? pic.twitter.com/3nDdhAIYLH
— Ram Gopal Varma (@RGVzoomin) February 27, 2023
ఇక అంబర్‌పేటలో నాలుగేళ్ల చిన్నారి వీధి కుక్కల దాడిలో మరణించిన ఘటనపై జీహెచ్‌ఎంసీ మేయర్, టీఆర్‌ఎస్ మంత్రులు స్పందిస్తూ.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందించలేదు. దీనిపై ఆర్జీవీ మండి పడుతున్నారు. ఇక బాధితుడి కుటుంబానికి మద్దతుగా నిలుస్తోన్న ఆర్జీవీ.. వారి తరఫున న్యాయ పోరాటానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆర్జీవీ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.