టాలీవుడ్ హీరోలు తమ రేంజు పెంచేసుకుంటున్నారు. రెమ్యూనరేషన్స్ లో ఒకరిని మించి మరొకరు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ విషయంలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా మామూలుగా లేదు. ఒకొక్కరు హిట్ మీద హిట్ కొడుతూ.. తమ మార్కెట్ ని విస్తరించుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయారు. రాజమౌళి.. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారితే.. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే రాజమౌళి అవసరం లేకుండానే ‘పుష్ప’తో తన ఫాలోయింగ్ ని అమాంతం పెంచేసుకున్నాడు. ఇంత ఫాలోయింగ్ ఉన్న మన తెలుగు హీరోలు ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచేసే పనిలో ఉన్నారు. తమ సినిమాల విషయంలో బాగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి తో చేయబోయే సినిమాకి భారీ మొత్తం అందుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇక విషయానికొస్తే.. టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ రెమ్యూనరేషన్ ప్రభాస్ తీసుకుంటున్నాడు. బాహుబలితో వచ్చిన పాన్ ఇండియా స్టార్ డంని నిలబెట్టుకుంటూ.. వరుస పెట్టి అలాంటి సినిమాలే చేస్తున్నాడు. ఒక్కో సినిమా కోసం రూ.100-120 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాలకి యంగ్ రెబల్ స్టార్ భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఇపుడు తాజాగా బన్నీ.. ప్రభాస్ రెమ్యూనరేషన్ దాటేశాడనే టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. దీని తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయనున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రానికి గానూ బన్నీ రెమ్యూనరేషన్ తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు గానూ బన్నీ అక్షరాలా రూ.125 కోట్లు డిమాండ్ చేశాడనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బన్నీ, ప్రభాస్ ని దాటేసినట్లే. సరికొత్త రికార్డ్ సృష్టించిన హీరోగా ఘనత సాధిస్తాడు. ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ తో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ రూ.100-120 కోట్లు తీసుకోనున్నాడని సమాచారం. కానీ బన్నీ మాత్రం అదే సందీప్ తో మూవీ కోసం ఏకంగా రూ.125 కోట్లు డిమాండ్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. మరి ప్రభాస్-అల్లు అర్జున్ రెమ్యూనరేషన్స్ పెంచేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.