ఇటీవల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు ఎక్కడి సినిమాలు అక్కడే తెరకెక్కి ఆ భాష వరకే రిలీజ్ అవుతుండేవి. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ మొదలైందో.. అప్పటినుండీ ప్రతి ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు రూపొందుతూ.. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. అయితే.. దక్షిణాది నటులంతా సౌత్ సినిమాలన్నింటిలో నటించేవారు. కానీ హిందీలో మాత్రం చాలా తక్కువ. ఇక ఇప్పుడిప్పుడే తెలుగు యాక్టర్స్ కూడా బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు అందుకొని నటిస్తున్నారు.
టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున ఓ పాన్ ఇండియా సినిమా ద్వారా బాలీవుడ్ లో సందడి చేయనున్నారు. స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన “బ్రహ్మాస్త్ర’ సినిమాలో నాగ్ కీలకపాత్ర పోషించారు. మైథలాజికల్ ఫాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ కాబోతుంది. అయితే.. తాజాగా బ్రహ్మాస్త్ర చిత్రబృందం స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రణబీర్, అలియా, అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ లతో పాటు అక్కినేని నాగార్జున కూడా కనిపించి సర్ప్రైజ్ చేశారు.
‘బ్రహ్మాస్త్ర పార్ట్-1 శివ’గా రిలీజ్ కానున్న ఈ సినిమాలో శివగా రణబీర్.. ఇషాగా అలియా, దమయంతిగా మౌనిరాయ్.. కనిపించనుండగా ప్రొఫెసర్ అరవింద్ చతుర్వేది పాత్రలో అమితాబ్, పురావస్తుశాఖ నిపుణుడు అజయ్ వశిష్ఠ్ పాత్రలో నాగార్జున కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసిన మేకర్స్.. జూన్ 15న బ్రహ్మాస్త్రం ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఇలాంటి పాన్ ఇండియా ఫాంటసీ మూవీలో అక్కినేని నాగార్జున భాగస్వామ్యం కావడంతో తెలుగులో సినిమాకి హైప్ పెరిగిందని చెప్పాలి. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా.. మరోవైపు మరో అక్కినేని హీరో నాగచైతన్య కూడా త్వరలో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేయనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విధంగా అక్కినేని హీరోల బాలీవుడ్ ఎంట్రీపై ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం నాగ్, చైతూ ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. మరి అక్కినేని హీరోల బాలీవుడ్ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.