బిగ్ బాస్ షో అంటేనే గొడవలు, కేకలు, గోలలు అబ్బా అదో చేపల మార్కెట్ లా ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ షోకి దంపతులు, ప్రేమికులు వెళ్లారు. కానీ వారి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. కానీ ఇప్పుడు జంటలు వెళ్తే గొడవలు పెట్టేస్తామని అంటుంది రిలీజ్ అయిన ప్రోమో.
బిగ్ బాస్ పరిచయం అక్కర్లేని పేరు. టాప్ రియాలిటీ షోల్లో ఒకటిగా నిలిచింది. దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొన్ని సీజన్ల నుంచి కింగ్ నాగార్జున కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. అంతకు ముందు సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. తర్వాత నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం నాగార్జున వ్యవహరిస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ విజయవతంగా ఆరు సీజన్లను పూర్తి చేసుకుని త్వరలో 7వ సీజన్ కి సిద్దం అయ్యింది. బిగ్ బాస్ లో సెలబ్రిటీలు, సామాన్యులు కూడా ఉంటారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో అల్లర్లు, గొడవలు, అలకలు, భావోద్వేగాలు, సంతోషాలు ఇలా ఎన్నో ఎమోషన్స్ ని ఒక చోట మిక్స్ చేసి చూపిస్తారు.
బిగ్ బాస్ షో పై పలు విమర్శలు వచ్చినా.. సీజన్ మొదలు కాగానే టీవీలకు అతుక్కుపోతారు ఆడియన్స్. అయితే ఈసారి బిగ్ బాస్ 7వ సీజన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు నిర్వాహకులు.గత కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన కొత్త ప్రోమో వచ్చేసింది. దానిపై ఒక లుక్కేద్దాం గురూ. కొత్త ప్రోమోలో రమేష్, రాధ అనే పాత్రలను పెట్టారు. ఆ పాత్రలు జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ వీళ్ళు ఎవరనే కదా మీ సందేహం. ఓ ప్రేమ జంట.. రమేష్ కొండ మీద నుంచి జారి పడిపోతుంటే నన్ను కాపాడు రాధ అని అంటాడు. రమేష్ నన్ను వదలద్దు.. నా చున్నీ పట్టుకో అని రాధ అంటుంది. దీంతో రమేష్.. రాధ నా ప్రాణం నీ చేతుల్లో ఉంది, నేను చావను అని అంటాడు. ముందు దుపట్ట పట్టుకో.. కమాన్ రమేష్. కమాన్ అని రాధ అంటుంది. చున్నీ పట్టుకున్న రమేష్.. రాధ ఈ ప్రపంచంలో మనల్ని ఏ శక్తి విడదీయలేదు అని అంటాడు. ది ఎండ్ అని ఒక టైటిల్ పడుతుంది.
కట్ చేస్తే నాగార్జున ఎంట్రీ. ‘ఇలాంటి క్లైమ్సాక్స్ లు మనం చాలా చూశాం కదా. అయితే ఎండింగే మార్చేద్దాం. ఇది అంతం కాదు ఆరంభం’ అని అంటాడు. అంతలోనే రాధకు తుమ్ము వచ్చి చున్నీని విడిచి పెడుతుంది. రమేష్ లోయలో పడిపోతాడు. రమేష్ ఎక్కడున్నావ్ అంటూ రాధ వెతుకుతూ.. ఉండగా.. మళ్ళీ సీన్ లోకి నాగార్జున వస్తాడు. ‘ఎవరి ఊహకి అందని సీజన్ బిగ్ బాస్ 7 అంతా ఉల్టా.. పుల్టా’ అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ సీజన్ పై మరింత హైప్ క్రియేట్ చేసింది. కలిసున్న జంటలకు గొడవలు పెట్టి విడదీస్తాం అన్న సంకేతాలు ఇస్తుంది ఈ ప్రోమో. ఎండింగే మార్చేద్దాం అనే డైలాగ్ వింటే అదే అనిపిస్తుంది. కానీ ప్రోమో చివరలో రాధ నుంచి రమేష్ దూరమయ్యే షాట్ ని నాగ్ పాస్ చేశాడు. అంటే మళ్ళీ పైకి లాగి కలుపుతారనుకోవాలేమో. చూడాలి ఏం జరుగుతుందో ఉల్టా పుల్టా ప్రోమో.. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.