హాలీవుడ్ సినిమాల ప్రభావం మన మేకర్స్ మీద ఉంటుంది. అందుకే కొన్ని సీన్స్ నచ్చితే వాటిని తమ సినిమాల్లో కాస్త మార్చి తీస్తుంటారు. అయితే ఒకప్పుడు కాపీ చేసినా పెద్ద తెలిసేది కాదు. కానీ ఇప్పుడు జనం బాగా అప్ డేట్ అయ్యారు. ఏ సినిమా చూసినా ఏ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారో వెంటనే బయట పెట్టేస్తున్నారు. తహగా ఆదిపురుష్ సినిమాని ఏ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టారో అనే విషయాన్ని వీడియోల రూపంలో పెట్టి విమర్శలు చేస్తున్నారు.
మామూలుగా ఏదైనా సినిమా మొదలైనప్పుడు ఒక టెక్స్ట్ పడుతుంది. ఈ సినిమాలోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరినీ ఉద్దేశించినది కాదు’ అని. అయితే ఆదిపురుష్ సినిమాలో ఇలాంటి టెక్స్ట్ ఒకటి వేయడం మర్చిపోయారనుకుంట. మరి లేకపోతే రామాయణాన్ని బేస్ గా చేసుకుని తీసే సినిమా అంటే పాత్రలు, సన్నివేశాలు ఎలా ఉండాలి. రామాయణం కథ తీస్తున్నప్పుడు రామాయణం నుంచి బయటకు వెళ్లాల్సిన పనే ఉండదు. అందులోనే బోలెడన్ని రిఫరెన్స్ లు దొరుకుతాయి. కానీ దర్శకుడు ఓం రౌత్ మాత్రం ఏకంగా హాలీవుడ్ కి వెళ్ళిపోయాడు. అక్కడితో ఆగకుండా తెలుగు సినిమాల్లో సన్నివేశాలని కూడా కాపీ చేశాడు.
ఆదిపురుష్ సినిమా చూసిన వారు హాలీవుడ్ సినిమాల్లోని కొన్ని సన్నివేశాల నుంచి కాపీ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. మార్వెల్, డీసీ కామిక్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి కాపీ చేశారని నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. క్లైమాక్స్ సీన్ లో వచ్చే పోరాట సన్నివేశాన్ని మార్వెల్ కామిక్స్ వారి అవెంజర్స్ నుంచి కాపీ చేసారని ట్రోల్ చేస్తున్నారు. సినిమా ప్రారంభంలో రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ తపస్సు చేస్తూ కనిపిస్తాడు. ఈ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో చూసిన రావణుడి వేషధారణకి, ఈ సినిమాలో రావణుడి వేషధారణకి చాలా తేడా ఉంటుంది. అల్ట్రా మోడ్రన్ రావణుడిగా చూపించారు. అది కూడా హాలీవుడ్ సినిమా నుంచి ఎత్తుకొచ్చారన్న విమర్శలు వస్తున్నాయి.
గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని కిట్ హారింగ్టన్ వేసిన జోన్ స్నో పాత్రను కాపీ చేశారు. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ఒక డ్రాగన్ పక్షి మీద వస్తుంటాడు. ఈ డ్రాగన్ పక్షిని గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాలోని ఓ సన్నివేశం నుంచి తీసుకున్నారు. రావణుడి పాత్రధారి రెండు త్రిశూలాలతో ఎంట్రీ ఇచ్చే సన్నివేశాన్ని థార్ పాత్ర నుంచి, ఆ తర్వాత వచ్చే సీన్స్ ని అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ ఇన్ఫినిటీ సినిమాల్లోని సన్నివేశాల నుంచి తీసుకున్నారు. ఆయుధంతో ఫైట్ చేసే సీన్ ని థార్ నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీరాముడు లంకకు వెళ్లే సీన్ లో సముద్రుడు స్పందించకపోతే విల్లు ఎక్కుపెడతాడు. అప్పుడు సముద్రుడు బయటకు వచ్చి సహాయం చేస్తానని అంటాడు. ఈ సీన్ ని నార్నియా 2 సినిమా నుంచి తీసుకున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ నీటిలో కూర్చుని ధ్యానం చేస్తుంటారు. ఈ సీన్ మనకి సైరా నరసింహారెడ్డి సినిమాలో కనబడుతుంది. ఈ సినిమాలో చిరంజీవి నీటిలో కూర్చుని ధ్యానం చేస్తుంటారు. ఆకాశం నుంచి వచ్చే రాక్షసులను సంహరించే సన్నివేశాన్ని మార్వెల్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీ వర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమా నుంచి కాపీ కొట్టారు. బాహుబలి సినిమాలోని ప్రభాస్ గాల్లో ఎగురుతూ బాణం విసిరే సన్నివేశాన్ని, చెట్ల కొమ్మ మీద నుంచి ఎగిరే సన్నివేశాన్ని ఆదిపురుష్ లో రిపీట్ అవుతుంది. వానర సేన స్టూడియోస్ క్రియేట్ చేసిన లార్డ్ శివ స్టిల్ నుంచి కాపీ చేశారు. ఆ పోస్టర్ లో శివుడు ఎడమ చేత్తో ధనుస్సు పట్టుకుని కుడి చేయి వెనక్కి పెట్టి ఉంటే.. ఆదిపురుష్ పోస్టర్ లో కూడా ప్రభాస్ స్టిల్ ఇలానే ఉంటుంది.
సీత జాడ కోసం హనుమంతుడి సముద్రం మీద నుంచి లంకకు వెళ్లే సీన్ ని సూపర్ మ్యాన్ సినిమా నుంచి కాపీ చేశారు. ఇందులో రాముడి పాత్రధారి ప్రభాస్ వేసుకునే డ్రెస్ మీద కుడి భుజం మీద ఒక లెదర్ తో చేసినటువంటి బెల్ట్ ఉంటుంది. దాన్ని స్పార్టస్ సినిమాలోని పాత్ర నుంచి తీసుకున్నారు. ఇలా ఒకటేమిటి అనేక సీన్స్ ని, క్యారెక్టర్స్ ని, ఎఫెక్ట్స్ ని అన్నిటినీ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేశారు. ఆదిపురుష్ లో లక్ష్మణుడి పాత్రకి, ఇంద్రజిత్ పాత్రకి మధ్య జరిగే పోరాట సన్నివేశంలో ఇంద్రజిత్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి లక్షణుడిని ఎత్తిపడేసే సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీన్ ని అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ సినిమాలోని ఓ సీన్ నుంచి కాపీ చేశారు.
ఆఖరికి వీడియో గేమ్స్ ని కూడా వదల్లేదు. వాలీ ఎంట్రీ సీన్ ని టెంపుల్ రన్ గేమ్ నుంచి కాపీ చేశారు. వానర లుక్ ని ‘ది లెజెండ్ ఆఫ్ టార్జాన్’ నుంచి కాపీ చేశారు. ఇక రావణ లంక నగరాన్ని అయితే థార్ సినిమాలోని అస్గర్డ్ నుంచి తీసుకున్నారు. ఇలా సినిమా మొత్తాన్ని హాలీవుడ్ సినిమాల్లో సన్నివేశాలతో నింపేశారంటూ ఓం రౌత్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే రాజమౌళి కూడా హాలీవుడ్ సినిమాలను రిఫరెన్స్ గా తీసుకుని తన స్టైల్ లో అంతకంటే గొప్పగా ప్రెజెంట్ చేస్తారు. కానీ ఓం రౌత్ తీసుకున్న రిఫరెన్స్ కంటే ఘోరంగా తీశారన్న విమర్శలు వస్తున్నాయి. హాలీవుడ్ సీన్స్ ని కాపీ కొట్టినా ఇంకా బెటర్ గా చేస్తారనుకుంటే వరస్ట్ గా చేశారన్న విమర్శలు చేస్తున్నారు.
ఇన్స్పైర్ అవ్వడం వేరు, కాపీ చేయడం వేరు. హాలీవుడ్ సినిమాల నుంచి యాజ్ ఇట్ ఈజ్ దించేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మాత్రం కాపీ, పేస్ట్ చేయడానికి రూ. 500 కోట్లు ఎలా అవుతుందని.. ఈ సినిమాలో చేసిన ఎఫెక్ట్స్ ని ఫోన్ లో ఒక మామూలు వీడియో ఎడిటర్ కూడా చేయగలుగుతాడని విమర్శిస్తున్నారు. ఆదిపురుష్ మేకర్స్ రామాయణాన్ని తప్ప అన్నిటినీ కాపీ చేశారని అంటున్నారు. ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేసినవి మాత్రమే, కొత్తగా క్రియేట్ చేసింది ఏమీ లేదు’ అన్న టెక్స్ట్ స్టార్టింగ్ లోనే వేసి ఉంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కాదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.