ఏళ్లుగా బుల్లి తెర నటిగా రాణిస్తోంది జ్యోతి రెడ్డి. ఎండమావులు సీరియల్ మొదలు కార్తీక దీపం వరకు పలు సీరయల్స్‌లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాల వెల్లడించింది.
నటి జ్యోతిరెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 9 ఏళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కెరీర్ ప్రాంరభంలో యాంకర్‌గా కూడా రాణించింది. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. నాటి నుంచి నేటి వవరకు అనేక సీరియల్స్‌లో నటిస్తూ.. ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎండమావులు సీరియల్ మొదలు కొన్నాళ్ల క్రితం వరకు తెలుగులో పాపులర్ అయిన కార్తీక దీపం సీరియల్‌లో నటించింది. కార్తీకదీపం సీరియల్‌లో ఏసీపీ రోషిణి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పలు సీరియల్స్‌లో నటిస్తూ.. బిజీగా ఉంది. ఇక తాజాగా జ్యోతిరెడ్డి.. ఓ ఇంటర్వ్యూలో తన బ్యాగ్రౌండ్, వ్యక్తిగత, వృత్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..
ఈ సందర్భంగా జ్యోతిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా సొంతూరు తెనాలి. కానీ నేను పుట్టి, పెరిగింది, చదివింది అంతా తెలంగాణలోనే. మా తాత గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చేశారు. నేను ఉమ్మడి ఏపీ మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి గారి మనవరాలిని. మా పెద్దనాన్న గారు భవనం శ్రీరాముల రెడ్డి గారు.. కూడా తెనాలి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మా కజిన్ అన్నయ్య రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చింది.
‘‘నేను 9వ తరగతి చదువుతున్నప్పుడే పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాను. అయితే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. పదవ తరగతి వరకు నేను యావరేజ్ విద్యార్థినే. కానీ కాలేజీకి వచ్చేసరికి బ్రైట్ స్టూడెంట్ అయ్యాను. డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్ అన్నింటోనూ నేను టాపర్‌ని. గోల్డ్‌మెడల్ సాధించాను. అలానే ఉద్యోగం చేయాలన్న ఆసక్తితో.. సీరియల్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి కూడా సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకునేదాన్ని. కానీ చాలా మంది పెద్ద డైరెక్టర్లు వాళ్ల పీఏలను నా డేట్స్ కోసం మా ఇంటికి పంపేవారు. అది చూసి మా అమ్మ.. ఇలా అందరికి అవకాశాలు వెతుక్కుంటూ ఇంటికి రావు. నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి అన్నారు. దాంతో ఈ ఫీల్డ్‌లో సెటిల్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇక ఇండస్ట్రీలో ఆర్టిస్ట్‌లు ఎదుర్కొనే కష్టాల గురించి చెప్పుకొచ్చారు జ్యోతిరెడ్డి. ‘‘అప్పట్లో ఆర్టిస్టులు చాలా డెడికేటెడ్‌గా ఉండేవారు. మేకప్ వేసుకుని ఉదయం 7.30 గంటల కల్లా సెట్‌లో ఉండేవాళ్ల. ఒక్కోసారి రాత్రి 12 అయ్యేది.. ఒక్కోసారి ఉదయం 6 వరకు షూటింగ్ నడిచేది. అప్పుడు ఇంటికి వచ్చి మేకప్ తీసేయాలంటే.. బద్దకంగా ఉండి అలానే పడుకుంటే బాగుండు అనిపించేది. ఇక లైటింగ్, క్యారెక్టర్, వెదర్‌ని బట్టి మేకప్ మెటీరియల్ మార్చాల్సి వచ్చేది. అలానే ఈ రోజు వేసుకున్న కాస్టూమ్య్ మళ్లీ తర్వాత వేయకూడదు. దాంతో ఎప్పుడూ షాపింగ్ చేయాల్సి వస్తుంటుంది. మేం కట్టినట్లు ఎవరూ ట్యాక్స్ కట్టరు. అయినా సరే మాకు లోన్స్ రావు. మా క్రెడిట్ కార్డు లిమిట్ 25 వేలతోనే స్టార్ట్ అవుతుంది. లోన్ కోసం వెళ్తే మీకు నెల నెలా పక్కాగా జీతాలు అంటూ ఉండవు కదా.. సీరియల్ నుంచి మిమ్మల్ని తీసెస్తే గ్యారెంటీ ఏంటీ అని అడిగేవాళ్లు’’ అంటూ చెప్పుకొచ్చింది.