పెళ్లి అనే బంధం ఇద్దరు మనుషుల్ని కలపగలుగుతుంది కానీ, రెండు మనసుల్ని కాదు. పెళ్లి తర్వాత బంధంలోకి అడుగుపెట్టిన ఆడ,మగ సఖ్యతగా ఉండాలంటే ఒకరితో ఒకరికి మంచి అనుబంధం ఏర్పడాలి లేదా.. ప్రేమ వివాహం అయితే ఆ అనుబంధం కొనసాగాలి. కానీ, కొంతమంది విషయంలో అలా జరగటం లేదు. పెళ్లి తర్వాత చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. విడిపోతున్నారు కూడా. ఈ గ్యాప్ కొంతమంది విషయంలో శాశ్వతం అవుతుంటే.. మరికొందరు కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఒక్కటవుతున్నారు. తాత్కాళికంగా భర్తలకు దూరంగా ఉండే స్త్రీలు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేంటంటే.. భర్తతో దూరంగా ఉన్న సమయంలో ఇతరులు చెప్పే చెప్పుడు మాటలు వినకూడదు.
వీటి వల్ల ఇద్దరి మధ్యా గ్యాప్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ వేరే వాళ్లు ఏదైనా చెప్పినా ఆ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి. మనసు వరకు అస్సలు తీసుకెళ్లకూడదు. భర్త గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడకూడదు. తర్వాతి కాలంలో ఇది ఇద్దరి మధ్యా దూరం పెరగటానికి కారణం అయ్యే అవకాశం ఉంది. భర్త తనతో లేని సమయంలో భార్య కొత్త స్నేహాల వైపు వెళ్లకూడదు. ముఖ్యంగా మగవారితో స్నేహం చేయటానికి అస్సలు ప్రయత్నించకూడదు. ఒకవేళ అదే జరిగితే.. అది తప్పుడు దోవలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. స్నేహం చేసే మహిళకు తప్పుడు ఉద్ధేశ్యం లేకపోయినా.. అవతలి వ్యక్తికి మీ ఉద్ధేశ్యం తప్పుగా కన్వే కావచ్చు.. ఇదే గనుక జరిగితే ఎవరి గొయ్యి వారు తవ్వుకున్నట్లు అవుతుంది.
ముఖ్యంగా పరాయి వ్యక్తితో ఫోన్ చాటింగ్, కాల్స్ వంటివి అతిగా ఉండకూడదు. మితి మీరినది ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే, కొన్ని సార్లు మగవారితో పరిచయం సంతోషాన్ని ఇస్తూ ఉన్నపుడు.. భర్తను మరిపిస్తున్నపుడు ప్రేమలు పుట్టే అవకాశం ఉంది. ఈ ప్రేమ పర్యావసానాలు ఆలోచించి ముందడుగు వేయాలి. ఆడ, మగ ఎవరైనా కావచ్చు.. కోర్కెలు ఆకలిలాంటివే కాబట్టి.. ముఖ్యంగా అక్రమ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు మరో పెళ్లి గురించి ఆలోచన చేసే ముందు సైకాలజిస్టుల సలహా తీసుకోవటం మంచిది. వీలైతే భర్తతో కలిసి వెళితే ఇంకా మంచిది.