ఈ ప్రపంచంలో 90 శాతం మంది కుడి చేతి వాటం ఉన్నవారు ఉన్నారు. ఎడమ చేతి వాటం వారు అంత తక్కువ ఉండటానికి కారణం ఏంటి? ఇందుకు ఏవైనా బలమై కారణాలు ఉన్నాయా?..
మీరు నమ్ముతారో లేదో కానీ, మనిషి ఇంత అభివృద్ధి సాధించటానికి బుర్రతో రెండు చేతులు ఎంతో కృషి చేశాయి. బుర్ర చేసిన ఆలోచనను ఆచరణలో పెట్టి అద్బుతాలను సృష్టించాయి. దేవుడి సృష్టిలో ఎక్కువ తక్కువలు లేకపోయినా.. మానవ పరిణామ క్రమంలో భాగంగా కొన్ని ఎక్కువ తక్కువలు ఏర్పడ్డాయి. అందులో ఒకటే.. చేతుల వాడకం. మీరు గమనించారో లేదో.. ఈ ప్రపంచంలో ఎడమ చెయ్యి వాటం ఉన్న వారికంటే.. కుడి చెయ్యి వాటం ఉన్న వారే ఎక్కువ మంది ఉంటారు. మరి, ఎందుకిలా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఏంటని తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా?.. ఇప్పటి వరకు చేయకపోయినా పర్లేదు. ఈ స్టోరీ చదివేయండి.. అన్ని విషయాలు మీకే తెలుస్తాయి.
చేతి వాటాలపై స్వీడన్లోని లండ్ యూనివర్శిటీ.. యూకేలోని చెస్టర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఓ కొత్త సిద్ధాంతాన్ని వారు తెర మీదకు తెచ్చారు. స్వీయ రక్షణ, విధ్వంసానికి.. చేతి వాటానికి సంబంధం ఉందని వారు అంటున్నారు. ద్వంద యుద్దంలో ఎడమ చేతి వాటం ఉన్నవారు బలంగా పోరాడగలిగినప్పటికి.. వారే ఎక్కువ శాతం గాయాలపాలై చనిపోయే వారట. అంతేకాదు! గుండె ఎక్కువ భాగం ఎడమ చెయ్యి వైపు ఉంటుంది. గొడవ సమయంలో ఎడమ చేతి వాటం ఉన్న వారు బలంగా ఎదుటి వ్యక్తిని కొట్టడానికి వీలుపడదు. అలా చేస్తే గుండె మీద అది ప్రభావం చూపిస్తుంది.
కత్తి యుద్ధ సమయంలో కూడా ఎడమ చేతి వాటం ఉన్న వారు పూర్తిగా తమ గుండె భాగాన్ని ప్రత్యర్థి వైపు తిప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో గుండెకు గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. గుండె గాయాలు ప్రాణాంతకంగా మారుతూ ఉంటాయి. ఈ కారణంగానే యుద్ధ శిక్షణ ఇచ్చటప్పుడు కుడి చేతిని వాడటం మొదలుపెట్టారట. కాగా, సదరు పరిశోధకులు మనిషి ప్రవర్తన, సైకలాజికల్ నిజాల ఆధారంగా ఈ విషయాలను వెల్లడించారు. వారు చెప్పింది కేవలం థియరీలు మాత్రమే. నిజం చెప్పాలంటే.. ఈ ప్రపంచంలో ఎందుకు కుడి చేతి వాటం వారు ఎక్కువ మంది ఉన్నారన్నది ఇప్పటికీ మిస్టరీనే.. మరి, మీరు ఎడమ చేతి వాటం కలవారా?.. కుడి చేతి వాటం కలవారా?.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.